header

Sri Patapateswari Ammavari Tirunala, Jatara / శ్రీపాతపాటేశ్వరీ అమ్మవారి తిరునాళ్ళు

Sri Patapateswari Ammavari Tirunala, Jatara / శ్రీపాతపాటేశ్వరీ అమ్మవారి తిరునాళ్ళు
గురజాల గ్రామంలో వెసిన ఈ అమ్మవారి దేవాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి (డిసెంబర్‌-జనవరి) మొదలుకొని 5 రోజుల పాటు అమ్మవారి తిరునాళ్ళ పల్నాడు ప్రాంతంలో అత్యంత వైభంగా జరుగుతుంది. అమ్మవారి గ్రామోత్సవం, అమ్మవారి బియ్యం విడుపు కొలత, తిరునాళ్ళ ఉత్సవం తరువాత జరిగే వసంత సేవతో అమ్మవారి ఉత్సవం ముగుస్తుంది.
పల్నాడు ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు జరుపుకునే ఈ తిరునాళ్లకు పది రోజుల ముందే సందడి ప్రారంభమవుతుంది. మూడు రోజుల కార్యక్రమం తరువాత బియ్యం కొలత అనే ప్రత్యేక కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది అమ్మవారి మహత్యంగా స్థానికులు చెబుతారు. అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం మధ్యాహ్నం నుండి జరిగే శిడిమాను కార్యక్రమం ఒక ప్రత్యేక ఆకర్షణ. శిడుమానును గుడి చుట్టూ తిప్పి తరువాత గ్రామంలో ఊరేగిస్తారు. గతంలో శిడిమానుకు మనిషిని కట్టి ఊరేగించేవారు. తరువాత మేకను కట్టి ఊరేగిస్తున్నారు. ప్రస్తుతం కూరగాయలను కట్టి ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
దేవాలయ చరిత్ర : ఈ అమ్మవారి గుడిని 1000 సంవత్సరాల క్రితమే నిర్మించినట్లు ఆలయంలో శాసనాన్ని బట్టి తెలుస్తుంది. 1826లో అప్పటి కలెక్టర్‌ ఓక్స్‌ ఈ దారిగుండా పోతూ అమ్మవారి ఆలయం వద్ద గుర్రాలను కట్టివేశాడట. గుర్రాలు మూత్రవిసర్జన చేసిన అనంతరం ఓక్స్‌ తన ప్రయాణాన్ని కొనసాగించగా గుర్రాలు అస్వస్థతకు గురవుతాయి. ఓక్స్‌ తన తప్పును తెలుసుకొని అమ్మవారిని వేడుకోగా గుర్రాలకు స్వస్తత లభిస్తుంది. ఓక్స్‌ గుడికి 40 ఎకరాల భూమిని ఇచ్చినట్లు తెలుస్తుంది.
నాయకురాలు నాగమ్మ ఈ అమ్మవారి మహాత్యాన్ని తెలుసుకొని దేవాలయం దగ్గర 100 ఎకరాల దూట చెరువును త్రవ్వించినట్లు ఇక్కడ ఉన్న శిలాఫలకంలో లిఖించచ బడివున్నది. పండుగ రోజున భక్తులు వండిన కుడుములు కొరికి కుక్కకు వేస్తే విష దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం.
ప్రయాణ సౌకర్యాలు : గుంటూరు జిల్లా కేంద్రం గుంటూరు బస్‌స్టాండ్‌ నుండి గురజాలకు బస్సులో వెళ్ళవచ్చు.