ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా పైడితల్లి అమ్మవారిని కొలుస్తారు. 1757 జనవరి 24న బొబ్బిలి-విజయనగరం రాజుల మధ్య జరిగిన యుద్ధం (బొబ్బిలి యుద్ధం) లో విజయ రామరాజు మరణిస్తాడు అదే సంవత్సరంలో విజయదశమి తరువాత మొదటి మంగళవారం నాడు పెద్దచెరువులో అమ్మవారి విగ్రహం కనబడుతుంది. అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి అక్కడే గుడి కడతారు.
ఈ ప్రాంతమంతా ఆ కాలంలో అడవిగా ఉండటంతో వనంగుడిగా పేరు పొందింది. 1758లో మొదటిసారి ఆనంద గజపతిరాజు మరియు పూజారిగా ఉన్న అప్పల నాయుడు నేతృత్వంలో సిరిమానోత్సవం జరిగింది. తరువాత 1924లో కోటకు దగ్గరగా ఉన్న మూడులాంతర్ల సెంటరులో పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు.
1980లో ఆలయ గోపురం నిర్మించబడింది. ప్రస్తుతం ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖవారి అధీనంలో ఉంది.
జాతర పుట్టుక : ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న రెండు చిన్న చిన్న రాజ్యాలు బొబ్బిలి, విజయనగరం. బొబ్బిలి రాజు రంగారావు, విజయనగరం రాజు విజయరామరాజు. వీరి మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా చరిత్ర ప్రసిద్ధి గాంచినది. ఈ యుద్ధంలో ఇరువర్గాల రాజు మరణిస్తారు. విజయ రామరాజు చెల్లెలు పైడితల్లి భక్తురాలైన పైడమ్మ, అన్న మరణానికి తట్టుకోలేక మహాశక్తిలో లీనమైనదంటారు. అప్పటి నుండి పైడమ్మనే పైడితల్లిగా కొలుస్తారు.
ఉత్సవాలు : ప్రతి సంవత్సరం అక్టోబరులో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమై నెలరోజు పాటు జరుగుతాయి.శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం రోజున నేరేడుమాను శాఖను స్థంభంలా చేసి ఆలయం వద్ద పాతుతారు. దానితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. విజయదశమి తరువాత వచ్చే మంగళవారం సిరిమాను ఉత్సవం జరుగుతుంది. సిరిమానోత్సవానికి 13 రోజుల ముందు ఊరంతా చాటింపు ఉంటుంది.
ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుండి కాక ఒరిస్సా నుండి కూడా ప్రజలు వస్తారు. సుమారు లక్షమంది ఈ ఉత్సవాలకు వస్తారు. ఉత్సవాలు నెల రోజులు చదురుగుడి, వనంగుడి ప్రధాన వీధులను విద్యుత్ దీపాలతో అత్యంత శోభాయమానంగా అంకరిస్తారు. ఉత్సవాలలో భాగంగా నాగినీ నృత్యాలు, పులివేషాలు, కత్తిసాము, కర్రసాము మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
సిరిమాను విశేషాులు : సిరిమానుగా తయారు చేయడానికి అనువైన చింతచెట్టును నెలరోజు ముందుగానే పూజారి ఎన్నిక చేస్తాడు. ఆ చెట్టుకు పూజ చేసి కుంభం పోసి అన్నదానం చేస్తారు. తరువాత ఆ చెట్టును ఖండించి ఎడ్లబండి మీద ఊరేగింపుగా పూజారి ఇంటికి తీసుకు వస్తారు. చిలకపూడి వంశస్థుడైన వడ్రంగి చింతచెట్టు మొదలు భాగాన్ని తల ఆకారంగా, చివరి భాగాన్ని కూర్చోవడాని అనువుగా మార్చి అమ్మవారిని ప్రతిష్టిస్తారు. ఈ సిరిమానును ఎడ్లబండిపై ఇరుసు సాయంతో పైకిలేపి వేలాడదీసి గుడికి తీసుకు వస్తారు. సిరిమానును ఎక్కే ప్రధాన పూజారినే పైడితల్లిగా కొలుస్తారు. సిరిమానోత్సం తరువాత వచ్చే మంగళవారం ఉయ్యాల ఉత్సవం నిర్వహిస్తారు. దీనితో ఉత్సవాలు పూర్తవుతాయి.