కృష్ణాజిల్లాలోనే పేరు గాంచిన వీరమ్మతల్లి తిరునాళ్లు ప్రతి సంవత్సరం మాఘమాసం, మాఘశుద్ధ ఏకాదశి రోజున ప్రారంభమై 15 రోజుల పాటు కొనసాగుతాయి.(ఫిబ్రవరి నెల) పారుపూడి వీరమ్మతల్లి ఈ గ్రామదేవత. ఈ 15రోజులు ఉయ్యూరు పట్టణమే కాకుండా పరిసర గ్రామాల్లో కూడా సందడిగా ఉంటుంది.
ఆలయ సమీపంలోనే అమ్మవారికి మరో గుడి ఉంది. దీనిని అమ్మవారు పుట్టినిల్లుగా భావిస్తారు. తిరునాళ్లలో భాగంగా మొదటిరోజు అమ్మవారు పుట్టినింటి నుండి బయలుదేరి మరుసటి రోజు ఆలయ ప్రవేశం చేస్తుంది.
మొదటిరోజు ఎదురుగండం, తిరు గండదీపాల మొక్కులు తీర్చుకోవటానికి సుమారు లక్షమంది భక్తులు వస్తారని అంచనా.
అనవాయితీ ప్రకారం మొదటి రోజు ఉయ్యూరు పోలీసులు పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించి తిరునాళ్ల ప్రారంభిస్తారు. వీరమ్మ తల్లి మొదటిరోజు మెట్టినుండి బయలు దేరినపుడు వేలాదిమంది మహిళలు, భక్తులు గండదీపాల మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారు ఆలయప్రవేశం చేసేవరకు ఆమెతో తిరుగుతూ తిరుగుండ దీపం మొక్కులు తీర్చుకుంటారు.
తిరునాళ్లలో రెండవరోజు సాయంత్రం ఉయ్యూరు కూడలిలో అమ్మవారికి ఊయల ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది.
11వ రోజున సిడిబండి ఉత్సవం ఎంతో వేడుకగా జరుగుతుంది. ఓ దళిత యువకుడిని సిడిబండి గంపలో కూర్చోబెట్టి గుడి ప్రాంగణంలో తిప్పుతారు. ఈ సమయంలో భక్తులు ఈ యువకుడిని అరటికాయలతో కొట్టడం ఆనవాయితి. 15వ రోజుతో తిరునాళ్లు ముగుస్తాయి.
ఈ తిరునాళ్లకు ఉయ్యూరు పరిసర గ్రామాలవారే కాకుండా, విదేశాలలో స్థిరపడినవారు, కృష్ణాజిల్లా పరిసర గ్రామాల ప్రజలు కూడా వచ్చి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు.