నెల్లూరు పట్టణానికి 24 కి.మీ.దూరంలో ఉన్న ఈ పురాతనమైన రేవుపట్నం సహజమైనది మరియు పరిశుభ్రమైన వాతావరణంతో వుంటుంది. విశాలమైన ఇసుకతిన్నెలతో, పచ్చటి కొబ్బరి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.రణగొణ ధ్వనులతో కూడిన పట్టణ జీవితంనుండి ప్రశాంతంగా గడపటానికి అనుకూలమైన ప్రదేశం.
మైపాడు బీచ్ నెల్లూరు నగరం నుండి 25 కి.మీ. దూరంలో ఉన్నది. నెల్లూరు నుండి మైపాడు బీచ్ కు బస్ లలో వెళ్ళవచ్చు. బీచ్ ఇసుక తిన్నెలతో, పచ్చదనంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులు చేపలు పట్టుటకు మరియు సముద్రవిహారానికి అనువైన ప్రదేశం. వసతి కొరకు ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి హోటల్ లో ఉండవచ్చు.
కోడూరు బీచ్ నెల్లూరుకు 18 కి.మీ. దూరంలో కలదు. ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి ఆటోలలో లేక బస్సులలో వెళ్ళవచ్చు. వారాంతపు సెలవులు గడపటానికి అనుకూలమైనది. ఇక్కడ నుండి కోడూరు బీచ్ కు సముద్రంలో బోట్ షికారు ఒక మధురమైన అనుభూతి. ఇక్కడున్న చిన్న చిన్న పలహారశాలలో చేపలతో చేసిన రుచికరమై వంటకాలు రుచిచూడవచ్చు. సముద్రతీరంలోనే ప్రసిద్ధి చెందిన వేళంగిని మాత చర్చ్ కలదు.
తుపులిపాలెం బీచ్ బంగారు వర్ణపు ఇసుక తిన్నెలతో, పచ్చటి చెట్లతో అద్భుతంగా ఉ:టుంది. సముద్రపు ఒడ్డున ఇసుకలో కొద్దిగా ఇసుకను త్రవ్వితే స్వచ్ఛమైన మంచినీటిని త్రాగవచ్చు. ఈ బీచ్ లో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటం ఒక మధురమైన అనుభూతి కలిగిస్తుంది. బోటింగ్ సౌకర్యం మరియు వసతి సౌకర్యం కలదు. వాకాడ టౌన్ నుండి 12 కి.మీటర్ల దూరంలో కలదు. కోట టౌన్ నుండి బస్సులలో తుపిలిపాలెం బీచ్ కు బస్ లలో వెళ్ళవచ్చు.