బొబ్బిలి వడ్రంగులు ఏకాండం కొయ్యముక్క (ఒకే చెక్క ముక్క)తోనే వీణను తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. పనస, సంపెంగ చెక్కలతో వీణ చేస్తారు. దేశంలో బొబ్బిలి వీణకున్న పేరు ప్రఖ్యాతులు మరే ప్రాంత వీణలకు లేదు. ఎంతో చరిత్ర కలిగిన బొబ్బిలి వీణకు జియోగ్రాఫికల్ గుర్తింపు లభించడం తెలుగు నేలకు గర్వకారణం. బొబ్బిలి సమీపానగల గొల్లపల్లి గ్రామానికి చెందిన సర్వసిద్ధి కుటుంబీకులు వీణల తయారీ సంప్రదాయాన్ని తరతరాలుగా కొనసాగించడం విశేషం. వీరి కుటుంబానికి చెందిన సర్వసిద్ధి అచ్చెన్న, చిన్నయ్యలకు ఒకనాడు వీణ తయారీపై వాదం పెరిగి, అదే పందెం వరకూ దారి తీసిందిట. దాంతో అచ్చెన్న 8 నుంచి 10 అంగుళాల పొడవున్న వీణను తయారు చేసి పందెంలో నెగ్గాడట. అటువంటి కుటుంబ చరిత్ర కలిగిన సర్వసిద్ధివారు వీణల తయారీనే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. 1980లో బొబ్బిలి వీణకు జాతీయ అవార్డు లభించింది. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డినుంచి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణకు మురిసిపోయి సర్వసిద్ధి వెంకట రమణను వైట్హౌస్కు రావలసిందిగా ఆహ్వానించడం చెప్పుకోదగినది. ఈమని శంకర శాస్త్రి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. బొబ్బిలి ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఉన్నది.