హార్సిలీ హిల్స్ ను ఇదివరకు ఏనుగు మల్లమ్మకొండ అనిపిలిచేవారు. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసిందంటారు ఇక్కడి అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి ఇచ్చేదంటారు. దానితో ఈ ప్రాంతం ఏనుగు మల్లమ్మ కొండగా పేరు పొందింది. కొండపై ఏనుగు మల్లమ్మ ఆలయాన్ని కూడా చేడవచ్చు. కొండపై ఉన్న అటవీ ప్రాంగణంలో 1859 సంవత్సరంలో నాటిందని చెప్పే నీలగిరి వృక్షం ఏపుగా ఎదిగి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలు ఈ మానుకు 1995లో మహావృక్ష పురస్కారం ఇవ్వడం మరో విశేషం.
బ్రీటీష్ వారు....భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించేటపుడు డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా ఉండేవాడు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ కొండపైకి విహారానికి వెళ్తుండేవారు. ఈ ప్రాంతంపు పచ్చదనం.. చల్లదనం.. ఆయన్ను ఆకర్షించాయి. తర్వాతి కాలంలో హార్సిలీ కడప జిల్లా పాలనాధికారిగా నియమితులయ్యారు. వెంటనే మదనపల్లె సమీపంలోని కొండపై ఒక బంగ్లాను నిర్మించి వేసవి విడిదిగా తీర్చిదిద్దారు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది. హార్సిలీ నిర్మించిన భవంతిని ఫారెస్ట్ బంగ్లా అని పిలుస్తారు. తర్వాతి కాలంలో మరో కార్యాలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. నేటికీ ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయి.
తూర్పు కనుమల్లోని దక్షిణ భాగపు కొండల్లో విస్తరించి ఉన్న హార్సిలీ హిల్స్ సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉంటుంది. అటవీ మార్గంలో ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఆనందంగా సాగిపోతుంది. సంపెంగ పూల పరిమళాలతో వీచే కొండగాలి అనుభవించాల్సిందే! చలికాలంలో చలి దెబ్బ చూపించే హార్సిలీ హిల్స్.. ఎండాకాలంలో హాయిగా ఉంటుంది. మండు వేసవిలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల లోపే ఉంటుంది. అందుకే ఈ ప్రాంతం ఆంధ్రా ఊటీగా పేరు పొందింది.
హార్సిలీ కొండపై పర్యాటకుల కొరకు అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల ఏర్పాటు చేసారు. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లూ ఉన్నాయిక్కడ.
చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, యూకలిప్టస్ చెట్ల మీదుగా వీచే నిర్మలమైన గాలిని ఆస్వాదించవచ్చు. ఎయిర్ కండిషన్ గదులలో ఉండే చల్లదనం ఇక్కడ ఉంటుంది. దుప్పటి కప్పుకొని నిదుర పోవాల్సిందే. హార్సిలీ హిల్స్‌కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
హార్సిలీ హిల్స్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం నుండి నుంచి 29 కి.మీ, తిరుపతి నుంచి 130 కి.మీ దూరంలో ఉంటుంది. మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. కొండపై పర్యాటక, అటవీశాఖకు చెందిన కాటేజెస్ మరియు ప్రైవేట్ అతిథి గృహాలు అద్దెకు లభిస్తాయి.