గొప్ప యుద్ధ చరిత్ర కలిగి గొప్పగా విలసిల్లింది కడపలోని సిద్దవటం కోట. 18 రాజవంశాలు.. హిందూ, ముస్లిం పాలకుల కాలంలో ఉన్నత వైభవానికి నిదర్శనంగా ఆ కోట నేటికీ పర్యాటకులను అలరిస్తోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఇక్కడ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సిద్దవటం దక్షిణ ద్వారమని అంటారు. తూర్పు వాహినిగా ఉన్న పెన్నానదికి ఉత్తరాన చుట్టూ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలోఉంది సిద్దవటం. బ్రిటీషర్ల హయాంలో సిద్దవటం జిల్లా కేంద్రంగా గొప్ప వైభవాన్ని చూసింది. పెన్నాలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగుల రాకపోకలకు తరుచూ అంతరాయం కలుగుతోంది. దీంతో జిల్లా కేంద్రాన్ని కడపకు మార్చారని తెలుస్తోంది. ఒకప్పుడు ఆ ప్రాంతంలో వట (మర్రి) వృక్షాలు ఎక్కువగా ఉండేవని పెన్నాలో స్నానం చేసిన సిద్దులు ఆ చెట్ల కింద తపస్సు చేసుకునే వారని, అందుకే ఆ ఊరికి సిద్దవటం పేరు వచ్చిందని జనంలో ప్రచారంలో ఉంది.
సిద్దవటాన్ని దాదాపు 18 రాజవంశాలు పాలించాయి. వీటిలో మట్లిరాజులు ముఖ్యపాత్ర పోషించారు. 12వ శతాబ్దం నుంచి వారి పాలన ఈ ప్రాంతంలో సాగిందని చరిత్రకారుల సమాచారం.
తొలుత కాకతీయులు, తర్వాత విజయనగర మహారాజులకు మట్లిరాజులు సామంతులుగా ఉండేవారని కూడా తెలుస్తోంది. సిద్దవటం జిల్లాలోని అన్ని కోటల కంటే ప్రాచీనమైనదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. 11వ శతాబ్దానికి ముందే ఈ కోట నిర్మితమైందని, నాటి నందన చక్రవర్తి ఇక్కడ మట్టి కోటను నిర్మించాడని తెలుస్తోంది.
తర్వాత తెలుగు చోళులు మట్టి కోటను ఇంకా పటిష్టం చేశారని, 14వ శతాబ్దంలో వచ్చిన మట్లిరాజులు కోటను బలిష్టమైన రాతి కోటగా పునర్నిర్మించారని శాసనాధారాలతోపాటు కడప కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది.
1648లో మట్టిదేవ చోళ వెంకటరాజు నుంచి ఈ రాజ్యం ముస్లిం పాలకుడు మీర్జుమ్లా ఆధీనంలోకి వచ్చిందని, 1717లో ఆర్కాట్ నవాబుల వశమైందని, ఆర్కాట్ పాలకుడు పత్తేసింగ్ నుంచి కడప నవాబు నబీఖాన్, అతని నుంచి నిజాం నవాబు, 1800వ సంవత్సరం అక్టోబరు 12న నైజాం నవాబు నుంచి దీన్ని బ్రిటీషర్లు స్వాధీనం చేసుకున్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఒకప్పుడు కోటలో పలు శివాలయాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కోట కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. కోటలో ఆకర్షణ కోసం పచ్చిక బయళ్లు పెంచారు. కోట నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటుంది. పరిశోధకులు కోటలోని తెలుగు, కన్నడ, సంస్కృత శాసనాలను అధ్యయనం చేసేందుకు వస్తుంటారు.
ఈ కోట హిందూ, ముస్లింల సమ్మిళత శైలికి నిదర్శనంగా కనిపిస్తుంది. కోటలో మసీదు కూడా ఉంది. 1802 ప్రాంతంలో ఈ కోటను సందర్శించిన బ్రిటీషు చిత్రకారుడు థామస్ ఫ్రీజర్ ఈ కోట గురించి రెండు అద్బుతమైన వర్ణ చిత్రాలు గీశారు. అవి నేటికీ లండన్ ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి.
మట్లిరాజులు యుద్ద పిపాసులేగాక కళలకు కూడా పెద్దపీట వేశారు. మట్లి యల్లమరాజు కుమారుడు ఆనందరాజు ఆస్థానంలో నాటి ప్రముఖ కవి ఉప్పుగుండూరు వెంకట కవి ఉండేవారు. ఒంటిమిట్ట దశరథరామ చరిత్ర రాసింది ఇతనే. అనంతరాజు కూడా రాయలవారిలాగా మంచి కవి. ఆయన స్వయంగా కకుత్స విజయం కావ్యం రాశారు. కవి చౌడప్ప కూడా అనంతరాజు అస్థానంలోని వారే.
రాయల కొలువులో లాగానే మట్లి అనంతరాజు కొలువులో కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఆయన రాజ్యపాలనలో రాయలంతటి పేరు గడించారు. ఒంటిమిట్ట ఆలయాన్ని పటిష్టం చేశారు.