కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం తదితర ప్రాంతాల్లో బౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ప్రధానంగా నందలూరు గ్రామానికి తూర్పున ఆడపూరు గుట్టల్లో ప్రాచీనమైన పదమూడు బౌద్ధ స్థూపాలున్నాయి. ఈ స్థూపాల్లో దేనిపై కూర్చున్నా ఎదురుగా పిరమిడ్ ఆకారంలోని కొండ కనిపిస్తుంది. బౌద్ధ భిక్షువులు కొండ దిగువన ఉన్న నదిలో స్నానం చేసి, ఈ స్థూపాలపై కూర్చొని, కొండ శిఖరాన్ని చూస్తూ ఏకాగ్రతతో ధ్యానం చేసేవారని తెలుస్తోంది. గుట్ట దిగువన ఉన్న గుహల్లో ఈ భిక్షువులు విశ్రాంతి తీసుకొనేవారనీ, మిగతా సమయాల్లో సమీప ప్రాంతాల్లోని ప్రజలకు జ్ఞానబోధ చేసేవారని కథనాలు ఉన్నాయి. ఈ గుట్టపై జరిపిన తవ్వకాల్లో పురాతనమైన సీసపు నాణేలు, కుండ పెంకులు, మట్టిపాత్రలు లభించాయి.
ఎలా వెళ్ళాలి ? కడప నుంచి సుమారు 47 కి.మీ. దూరంలో ఆడపూరు ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.