ముప్ఫైరెండు వేల పద కవితలు రచించి, శ్రీ వేంకటేశ్వర స్వామికి అర్పించిన తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుని జన్మస్థలం కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామం. తాళ్లపాకకు రాజంపేట- కడప మెయిన్‌రోడ్డు నుంచి వెళ్లే రహదారి ప్రారంభంలో 108 అడుగుల అన్నమాచార్య విగ్రహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
తాళ్లపాకలో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని కూడా నిర్మించారు. జిల్లాలోని రైల్వేకోడూరు నుంచి తిరుమలకు దట్టమైన అటవీ ప్రాంతంలో ‘అన్నమయ్య’ పేరుతో ఒక కాలిబాట ఉంది. అన్నమయ్య ఈ బాటలోనే తిరుమలకు వెళ్లేవాడని ప్రతీతి. అందుకే తిరుమలకు చాలామంది ఈ మార్గంలో నడిచి వెళ్తూ ఉంటారు.
కడప నుంచి 58 కి.మీ. దూరంలో తాళ్లపాక ఉంది. రోడ్డు మార్గంలో అక్కడికి చేరుకోవచ్చు. తాళ్ళపాకకు సుమారు 6 కి.మీ. దూరంలోని రాజంపేటలో రైల్వే స్టేషన్ ఉంది.
వసతిసౌకర్యం: రాజంపేటలో ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్ హౌస్‌లు, లాడ్జిలు అందుబాటులో ఉంటాయి.