header

Nallamla Forest Eco Tourism / నల్లమల ఎకో టూరిజం

Nallamla Forest Eco Tourism / నల్లమల ఎకో టూరిజం

కర్నూలు జిల్లాలోని పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు నల్లమల ఎకో టూరిజానికి ముఖద్వారాలు. వారాంతాల్లో, సెలవు రోజులలో వేలసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు. అడవి అందాలను ఆస్వాదించాలని పెద్దలు..... వన్యమృగాలను చూడాలని పిల్లలు ఆరాటపడుతుంటారు.
ట్రెక్కింగ్ ప్రియులకు మంచి ప్రదేశం ‘జంగిల్ క్యాంప్’లోని కాటేజీల్లో బస చేసి తీరికగా అడవంతా చూడొచ్చు. లేక ఉదయాన్నే .. సఫారీ చేసి, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ.. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు. వారాంతాల్లో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు తదితర నగరాల నుంచి పర్యాటకులు నల్లమలకు భారీ సంఖ్యలో వస్తుంటారు.
రోజంతా హాయిగా గడుపుతారు. అంతేకాదు ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటం విశేషం.
పచ్చర్ల సఫారి ట్రాక్....
ఎకో టూరిజంలో అందరినీ ఆకర్షిస్తున్నది ‘సఫారి ట్రాక్’. పచ్చర్ల జంగిల్ క్యాంప్లో ఈ ట్రాక్ 10-15 కిలోమీటర్లు ఉంది. ఒక్కో జీపులో ఆరుగురు ప్రయాణించవచ్చు. దాదాపు రెండు గంటలుండే సఫారీ యాత్ర.. భారీ వృక్షాలు, దట్టమైన పొదల గుండా సాగిపోతుంది. ఎండ తగలకుండా దట్టమైన చెట్ల, ఆ చెట్లకు గజిబిజిగా అల్లుకున్న తీగలు. ఆ తీగల సౌందర్యాన్ని ఇనుమడింప చేసే పూలు, ఆ పూలలోని మకరందాన్ని గ్రోలుతున్న తేనెటీగలు. పంచెవన్నెల సీతకోకచిలుకలు, రంగు రంగుల పక్షులు.. చూడవలసిందే! గుబురులో ఎలుగుబంటి. దానిని చూసి భయంతో పరిగెత్తే దుప్పులు, జింకలు ఇంకా లోపలకు వెళితేచఅప్పటి దాకా చెట్ల మీద ఉండి కీచులాడిన కోతిమూకలు గమ్మునుండిపోతాయి. నాలుగు దిక్కులూ పరిశీలనగా చూస్తే... పులి రాజసంగా ఠీవీగా నడుస్తూ కనిపిస్తుంది పులిని దగ్గరగా చూసే అదృష్టం అన్నిసార్లు ఉండదు. అప్పుడప్పుడు తప్ప పులి కంటపడదంటారు అటవీ శాఖ అధికారులు. సఫారీ ట్రాక్ మధ్యలో ఉల్లెడ అనే క్షేత్రం వస్తుంది. ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది. చుట్టూ లోయలతో ఈ ప్రాంతం మనోహరంగా ఉంటుంది.
జంగిల్ సఫారీ: రూ.800 - ఆరుగురికి.
కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పచ్చర్ల 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రకాశం గిద్దలూరుకు 35 కిలోమీటర్ల దూరం. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు.
ఎకో వాక్
పచ్చర్ల, బైర్లూటి, తుమ్మలబయలు క్యాంపుల్లో జంగిల్ సఫారీతో పాటు ఉన్న మరో విశేషం ఎకో వాక్. ఐదు నుంచి పది మంది సభ్యులు అడవిలోనికి వెళ్లొచ్చు. తోడుగా గైడ్ ఉంటాడు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతిస్తారు. ఇక్కడ 200 పక్షి జాతులు ఉంటాయి. 90 రకాల సీతకోకచిలుకలు కూడా ఇక్కడ ఉన్నాయంటారు.
తుమ్మలబయలు......
తుమ్మలబయలు ఇప్పుడిప్పుడే ఎకో టూరిజానికి వేదికగా పేరుపొందుతుంది. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఉన్న ఈ కేంద్రానికి పర్యాటకుల తాకిడి ఎక్కువే. ఇక్కడి జంగిల్ క్యాంప్లో సఫారీతో పాటు, ఎకోవాక్, బర్డ్, బటర్ ఫ్లై స్కౌట్, ఆర్చరీ విన్యాసాలకు అవకాశం ఉంది. సఫారీ ధర రూ.800 (ఆరుగురికి)
. తుమ్మలబయలు శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లే దారిలో 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మన్ననూరులో టైగర్ సఫారీ
నల్లమల అడవికి మహబూబ్నగర్ నుంచి కూడా వెళ్లొచ్చు. ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూరు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడా సఫారీ రైడ్ ఉంది. ఆ దారిలో ఫర్హాబాద్ వ్యూ పాయింట్ చూడదగిన ప్రదేశం. మన్ననూరులో వనమాలి అతిధిగృహం విడిదికి అనుకూలం. ఇక్కడికి సమీపంలో మల్లెలతీర్థం (17 కి.మీ), లొద్ది మల్లన్న ఆలయం (7 కి.మీ), ఉమామహేశ్వరం (32 కి.మీ), శ్రీశైలం (57 కి.మీ) ఉన్నాయి.
వసతి సౌకర్యాలు....
పచ్చర్ల జంగిల్ క్యాంప్లో 4 కాటేజీలు, 2 టెంట్ హౌజ్లు, బైర్లూటి క్యాంప్లో 4 కాటేజీలు, 6 టెంట్ హౌజ్లో పాటు డార్మెటరీలు అందుబాటులో ఉన్నాయి. టెంట్ హౌజ్ అద్దె రూ.5,000, కాటేజీ అద్దె రూ.4,000 (ఇద్దరికి) అరేళ్లు దాటిన పిల్లలకు రూ.1,000 అదనం. డార్మెటరీలో ఒక్కో బెడ్కు రూ.2,000 వసూలు చేస్తారు. బస చేసిన వారికి రెండు పూటలా భోజనంతో పాటు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. జంగిల్ సఫారీ ఉచితం.
కాటేజీలు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. www.nallamalaijunglecamps.com
బైర్లూటి సఫారీ ట్రాక్
బైర్లూటి ఎకో టూరిజం నుంచి 10 కిలోమీటర్ల మేర సఫారీ ట్రాక్ ఉంది. ఇక్కడి నుంచి మూడున్నర కిలోమీటర్లు ముందుకు వెళ్తే.. టైగర్ జోన్ ఉంటుంది. అవకాశం ఉంటే పులిని చూడొచ్చు. అలాగే మరింత ముందుకు వెళ్తే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టబనిదని చెప్పే.. ‘వీరభద్రస్వామి దేవాలయం’ కనిపిస్తుంది. కానీ ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి. వేసవిలోనూ ఇవి జలకళతో కళకళలాడుతుంటాయి. ఆలయానికి సమీపంలో ఓ జలపాతం కూడా ఉంది. అడవి మార్గాన కాలినడకన శ్రీశైలం వెళ్లే భక్తులు వీరభద్రుడిని చూడవచ్చు.
సఫారీ ఆరుగురికి రూ.800-
బైర్లూటిలో సఫారీ ట్రాక్తో పాటు హెరిటేజ్ వాక్, ట్రెక్కింగ్ అవకాశాలూ ఉన్నాయి. దట్టమైన అడవిలో ట్రెక్కింగ్ చేయాలంటే సాహసం కావాలి. ఐదుగురు సభ్యుల బృందానికి రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారాంతాల్లో హైదరాబాద్, కర్నూలు నగరాల నుంచి యువతీయువకులు ట్రెక్కింగ్ కోసం బైర్లూటి ఎకో సెంటర్కి వస్తుంటారు.
బైర్లూటి క్యాంప్ కు ఎలా వెళ్లాలి?
కర్నూలు, దోర్నాల, నంద్యాల నుంచి బైర్లూటి క్యాంప్ వెళ్లొచ్చు. కర్నూలు నుంచి 85 కి.మీ, దోర్నాల నుంచి 45 కి.మీ, నంద్యాల నుంచి 60 కి.మీ దూరం ఉంటుంది. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు.