మన రాష్ట్రంలో న్లెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటకి కేవలం 15 కి.మీ దూరంలోని నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది.
సువిశాలమైన కొలను....దానిలోపల ఒడ్డున రకరకాల చెట్లు...వాటినిండా విరబూసినట్లున్న రంగురంగుల పక్షులు... ఎక్కువశాతం బూడిద రంగులో ఉన్న పెలికాన్లే.
నెల్లూరుజిల్లాలోని నేలపట్టు గ్రామంలో ఈ సంరక్షణా కేంద్రం ఉంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 404 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రానికి విదేశీపక్షులు ఏటా చలికాంలో వేలమైళ్ళు ప్రయాణించి ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. పెలికాన్ పక్షులకు దక్షిణాసియాలోనే అతి పెద్ద ఆవాసం నేలపట్టు.
నేలపట్టు నీటినిండా కరుప, నీర్కంటి...అంటూ రకరకాల పేర్లతో పిలిచే బేరింగ్ టోనియా యాక్యూటాంగ్యూలా అనే చెట్లు పుష్కంగా పెరుగుతాయి. ఈ చెట్లు దాదాపు సగం వరకు నీటిలోనే మునిగివుంటాయి.
బురదతో కూడిన ఈ మట్టి ఈ చెట్లకు చక్కగా సరిపోతుంది. చెట్ల కారణంగా నీటిలోనే చేపలకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. దానితో మత్య్స సంపదకు లోటు వుండదు. అందుకే పక్షులు అంత దూరం నుంచి తరలివస్తుంటాయి.
నేలపట్టు, గూడబాతు సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధిచెందింది. అంతరించిపోతున్న నత్తగుల్ల కొంగ, నీటికాకి, తెల్లకంకణాయి,శబరికొంగ పక్షులకు కూడా మంచి సంతానోత్పత్తి కేంద్రం. బర్మా, నేపాల్, అమెరికా, చైనా, ధాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ అంటార్కిటికా ప్రాంతాలనుంచి ఈ పక్షులు శీతాకాలు విడిదికి ఇక్కడకు వలస వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇవి ఇక్కడే వుంటాయి. అక్టోబర్ మొదటి, రెండో వారంలో వచ్చిన పక్షులు మూడోవారంలో గూడుకోసం సామాగ్రిని పోగుచేసుకుంటాయట.
నాలుగోవారంలో ఆడమగ పక్షులు జతగూడతాయట. ముందుగా ఆడపక్షి ఒక చిన్న కర్రపుల్లను తీసుకుని దానికిష్టమైన మగపక్షి దగ్గరకు వెళుతుంది. మగపక్షి ఆ పుల్లను స్వీకరిస్తే ఆ రెండు జోడి కడతాయి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో గుడ్లుపెడతాయి. డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో గుడ్డు నుండి పిల్లలు బయటకు వస్తాయి. తరువాత తల్లి పక్షి పిల్లలకు ఈత కొట్టడం, ఎగరడం, ఆహారం సంపాదించడం నేర్పిస్తుంది. ఇవి పురుగు, క్రిమికీటకాలను, చేపలు, కప్పు, కప్పపిల్లలు, నత్తు, పీతలు, గొంగళిపురుగు, నాచుమొక్కనలను ఆహారంగా తీసుకుంటాయి.
పిల్ల పక్షులు పెరిగి పెద్దవయిన వెంటనే స్వస్ధలానికి వెళ్ళిపోతాయి. ప్రస్తుతం నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో గ్రేపెలికాన్లే ఎక్కువ తరువాత ఓపెన్‌బిల్ స్టార్క్, పెయింటెడ్ స్టార్క్,లిటిల్ కార్మోరాంట్ నైట్ హెరాన్, వైట్ ఇబిస్, ఇండియన్ మూర్హెన్, స్పాట్ బిల్డ్డక్స్, డాబ్‌చిక్స్, రెడ్ వెంటెడ్ లాపింగ్, నైట్ హెరాన్స్ తదితర పక్షులు ఉన్నాయి. అక్కడవున్న వాచ్టవర్లు ఎక్కితే ఈ పక్షులన్నిటిని చక్కగా చూడవచ్చు.
ఇక్కడే ఓ మ్యూజియం, లైబ్రరీ, ఆడిటోరియం కూడా ఉన్నాయి. ఈ పక్షుల కోసం ఫిబ్రవరిలో వేడుకను కూడా నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడవున్న అభయారణ్యంలో తోడేళ్ళు, లోరిస్ జాతికోతులు, చుక్క జింకలు తాబేళ్ళు, పాములు, కూడా ఉన్నాయట. అందుకే నేలపట్టు చూడచక్కని పర్యావరణ మరియు పర్యాటక కేంద్రం కూడా.