Revu Polavaram….రేవుపోలవరం …..
రేవు పోలవరం విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సముద్రతీర విహార ప్రాంతం. ఇంతకాలం సరైన సౌకర్యాల లేమితో ఈ రేవు ప్రాచుర్యంలోనికి రాలేదు. అంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారు ఈ రేవు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాటేజీలు, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ జిల్లా అందాలకు అద్దం పడుతూ.. కొబ్బరి చెట్లతో కనువిందు చేస్తుంది రేవుపోలవరం.
సముద్రతీరంలో సముద్రంలోకి చూస్తూ నిలబడితే.. కెరటాలు పాదాలను చల్లగా తాకుతాయి.
సముద్రతీరం నుంచి సముద్రంలోకి నిర్మించిన వంతెన ప్రత్యేక ఆకర్షణ. సుమారు 200 మీటర్ల పొడవైన వంతెనపైకి వెళ్తే.. సముద్రం మధ్యలో నిల్చున్న అనుభూతి కలుగుతుంది. వారాంతాలలో, సెలవులలో విశాఖ, చుట్టుపక్కల జిల్లాల నుంచి రేవుపోలవరం వచ్చే సందర్శకులతో తీరం కళకళలాడుతుంది.
తీరాన్ని అనుకుని ఉన్న కొండపై ఎత్తైన శివపార్వతుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణ. ఇవి వైజాగ్ కైలాసగిరిపై కొలువుదీరిన ఆదిదంపతుల మూర్తులను గుర్తుకుతెస్తాయి.
సముద్రానికి సమీపంలో లక్ష్మీమాధవస్వామి ఆలయం చూడదగ్గ స్థలం. ఈ సుందరమైన తీరంలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుపుకొన్నాయి. సింహాద్రి నుంచి గీతగోవిందం వరకు ఎన్నో చిత్రాల్లో రేవుపోలవరం కనబడుతుంది. షార్ట్‌ఫిల్మ్‌లు, సీరియల్స్ షూటింగ్‌లు కూడా తీస్తుంటారు.
తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి 35 కి.మీ., విశాఖపట్నం నుంచి 75 కి.మీ దూరంలో ఉంటుంది రేవుపోలవరం. ఈ రెండు చోట్ల నుంచి నక్కపల్లి అడ్డరోడ్డు మీదుగా రేవుపోలవరం చేరుకోవచ్చు. నక్కపల్లి అడ్డరోడ్డు, తుని, యలమంచిలి నుండి బస్సులలో వెళ్లవచ్చు.
నక్కపల్లి అడ్డరోడ్డు నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి. నర్సీపట్నం నుండి కూడా వెళ్లవచ్చు
Ramakrishna Beach రామకృష్ణ బీచ్ :
విశాపట్నంలో పేరు పొందిన బీచ్ రామకృష్ణ బీచ్. ప్రకృతి సహజమైన అందాలతో, . కొబ్బరి చెట్లతో, బంగారు వర్ణపు ఇసుకతో పర్యాటకులకు కనువిందుచేస్తుంది.
సమీపంలోని కాళిమాత ఆలయం, మత్స్యదర్శిని వంటివి అదనపు ఆకర్షణ. ఈ బీచ్ ఈతకు అనుకూలం కాదు. బీచ్ రోడ్డులోనే లగ్జరీ హోటల్స్, పార్కులతో పాటు కాఫీ హౌస్ లు, తినుబండారాల షాపుల, పార్కులు కలవు.ఈ బీచ్ లో పాశ్చాత్య సంస్కృతి కనబడదు.
దగ్గరలోనే సబ్ మెరైన్ మ్యూజియం ఉంది.
రుషికొండ బీచ్
విశాఖపట్టణానికి 8 కి.మీ. దూరంలో ఉన్న రుషికొండ బీచ్ ఇసుక తిన్నెలతో, సహజమైన వాతావరణంతో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది.
ఈతకు మరియు పడవ పోటీలకు అనుకూలమైన ప్రాంతం. ఎ.పి టూరిజం వారివి 12 కాటేజ్ లలో విడిది చేయవచ్చు.14వ శతాబ్ధంనాటి రుష్యేశ్వరాలయం ఇక్కడే ఉన్నది.
యారాడ బీచ్ :
బంగారు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, చుట్టూ చెట్టు చేమలతో పచ్చదనం, అందమైన కొండరాళ్ళతో పర్యాటకులకు కనువిందు చేస్తుంది యారాడ బీచ్.
గంగవరం బీచ్ :
స్టీల్ ప్లాంట్ కు దగ్గరలో ఉంది గంగవరం బీచ్. ప్రకృతి సహజమైన వాతావరణంతో ఉండటం
వలన చిత్రనిర్మాణాలు జరుగుతుంటాయి.
ముత్యాలపాలెం బీచ్ :
ఈ బీచ్ కు దగ్గరలో శ్యామలకొండ, సాగరతీరం చూడటం ఒ అనుభూతి అనవచ్చు. కొండకు
తీరానికి మధ్య సముద్రం వరకు ఉన్న ప్రవాహం యల్ ఆకారంలో సాగిపోతూ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.