తూర్పు కనుమల్లో అందమైన ప్రాంతం పుణ్యగిరి. విజయనగరం జిల్లా శృంగవరపు కోట సమీపంలోని పుణ్యగిరి క్షేత్రం ఉంది. చక్కని పచ్చదనం, అందమైన జలపాతాలతో ప్రకృతి శోభతో చూపరులకు కనువిందు చేస్తుంది.
ఈ కొండపై ఉంది ఉమాకోటిలింగేశ్వరుడి ఆలయం. ఆ పక్కనే అందమైన జలపాతం కనిపిస్తుంది. పుణ్యగిరి సమీపంలోనే విరాటరాజు కోట ఉండేదనీ, అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఇక్కడ ఉన్నారని చెబుతారు. ఆ సమయంలో పాండవులు ఇక్కడి ఉమాకోటిలింగేశ్వరుడిని పూజించారంటారు.
ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న పుణ్యగిరి క్షేత్రం పర్యాటక కేంద్రంగానూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని కొండలు, వాటి నుంచి జాలువారే జలపాతాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొండపైకి వెళ్లే దారిలో ధారగంగమ్మ జలపాతం యాత్రికులను విశేషంగా ఆ కట్టుకుంటుంది. ధారగంగమ్మను గిరిజనులు దేవతగా భావిస్తారు.
30 అడుగుల ఎత్తు నుంచి పడే జలధారలు మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. వత్సరమంతా ఈ జలపాతం సవ్వడులు వినిపిస్తూనే ఉంటాయి. ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న జలపాతాలు ఎన్నో ఉన్నాయి. కార్తికమాసం, శివరాత్రి సందర్భంగా యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పుణ్యగిరిపై ఉన్న జలపాతాల నీటి ప్రవాహంలో అస్థికలు నిమజ్జనం చేస్తే పోయినవారికి సద్గతులు కలుగుతాయని విశ్వసిస్తారు.
ఎలా వెళ్లాలి..? విశాఖపట్టణం నుంచి అరకులోయ వెళ్లే దారిలో (60 కి.మీ.) పుణ్యగిరి ఉంది. ఏడాదంతా పుణ్యగిరికి పర్యాటకులు వస్తూ ఉంటారు. శృంగవరపుకోట నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖ, విజయనగరం నుంచి ఎస్‌కోటకు బస్సులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి ఆటోల్లో పుణ్యగిరికి వెళ్లవచ్చు