కటికి జలపాతానికి కొంత దూరం ట్యాక్సీల్లో ప్రయాణం చేయాలి. తరువాత ఓ కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. నడక జలపాతం సవ్వడి.. దగ్గరయ్యే క కొద్దీ.. జలపాతగీతం మరింత మధురంగా చెవిన పడుతుంటుంది.. దట్టమైన చెట్ల మధ్యలో నుంచి వెళ్తే..ఆశ్చర్యం..... 350 అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతం దర్శనమిస్తుంది. జలధారల నుంచి విడివడిన నీటి బిందువులు సూదిమొనల్లా గుచ్చుకుంటాయి. చల్లగా ఉన్న నీళ్లు మంచుకరిగి మీద పడుతోందా అనిపిస్తోంది. మనోహరమైన దృశ్యం చూశాక.. జలపాతం కిందికి చేరుకుంటారు. నిమిషాలు.. గంటలు.. తెలియకుండా గడచిపోతాయి. వర్షాకాలం మొదలయ్యే కటికి సోయగాలు వేసవి వచ్చేవరకూ కొనసాగుతాయి.
కటికి జలపాతం బొర్రాగుహలకు 7 కి.మీ దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి ఉదయం ఐదు గంటలకు కిరోండూల్ పాసింజర్ రైలులో బొర్రాగుహలకు చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో జలపాతానికి కిలోమీటర్ దూరం వరకు వెళ్లొచ్చు. ఆపై కాలినడకన వెళ్లాలి.
సౌకర్యాలు : కటికి జలపాతానికి వెళ్లే నడకదారిలో చిరుతిళ్లు లభిస్తాయి. బొర్రాగుహల దగ్గర బస, భోజన వసతులు ఉన్నాయి.