బ్యాంకాక్... థాయిలాండ్ దేశ రాజధాని. . ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతంగా పేరుపొందిన నగరం. స్థానికంగా ఈ నగరాన్ని క్రాంగ్‌తేప్ అని పిలుస్తుంటారు. పూర్తి పేరు చాలా పొడవుగా ఉంటుంది. 169 అక్షరాలతో టంగ్‌ట్విస్టర్‌లా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద నగరం పేరుగా గిన్నిస్ రికార్డూ ఉందిబ్యాంకాక్ నగరాన్ని వెనిస్ ఆఫ్ ఆసియా, సిటీ ఆఫ్ ఏంజెల్స్ లాంటి పేర్లతోనూ పిలుస్తారు. థాయిలాండ్ జనాభాలో మొత్తం 10 శాతం మంది నివసించేది ఈ నగరంలోనే.
ఈ నగరం ప్రసిద్ధ ఆలయాలకు, స్ట్రీట్ ఫుడ్స్, షాపింగ్‌కి పెట్టింది పేరు.
బ్యాంకాక్ నగరం చౌప్రాయా నదీ పరీవాహక ప్రాంతంలో ఉంటుంది.
బ్యాంకాక్‌లోని అన్ని పేరొందిన దేవాలయాల బొమ్మలతో నాణాలుంటాయి. ఈ నగరంలోనూ ప్రత్యేకంగా చైనా టౌన్ ఉంది. దాదాపు పదిలక్షల మంది చైనీయులు ఇక్కడ నివసిస్తున్నారు.
ఛతుచక్ వారాంతపు మార్కెట్ ప్రత్యేక ఆకర్షణ. 27 ఎకరాల్లో ఉండే ఈ సంత సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. 15 వేల స్టాళ్లు ఉండే ఈ మార్కెట్‌కి శని, ఆదివారాల్లో 2 లక్షల మంది పర్యటకులు వస్తుంటారు.
ఇక్కడి ఎరవన్ మ్యూజియం మూడు తలల ఏనుగు భవంతిలో ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు బుద్ధ విగ్రహం ఇక్కడే ఉంది. 5.5 టన్నుల బరువుతో ఉంటుందీ విగ్రహం.
బ్యాంకాక్ లో ఫ్లోటింగ్ మార్కెట్లు కూడా అందర్నీ ఆకట్టుకుంటాయి. నీటిపై పడవల్లో ఉంటాయి ఈ సంతలన్నీ. పండ్లు, పువ్వులు, ఆహార పదార్థాలు, రకరకాల వస్తువులు ఇలా అన్నింటినీ పడవల్లోనే పెట్టుకుని వచ్చి అమ్ముతుంటారు.
నూతన సంవత్సరం రోజున ఇక్కడ సాంగ్‌క్రన్ పేరుతో పండగ జరుపుకుంటారు. గుంపులు గుంపులుగా వీధుల్లోకి వచ్చి ఆటలో భాగంగా నీటి యుద్ధాలు చేస్తారు.
1782 నాటి ఇక్కడి గ్రాండ్ ప్యాలెస్ మంచి పర్యటక ఆకర్షణ. చక్కని నిర్మాణశైలితో కనువిందు చేస్తుంది.