బార్సిలోనా, స్పెయిన్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటి. పర్యాటకులు ఎక్కువగా వచ్చే ఐరోపా నగరాల్లో ఈనగరానిది నాలుగో స్థానం. పూర్వం రోమన్లుచే ఈ నగరం నిర్మించబడింది. కొన్ని భవనాలు అంతకంటే ప్రాచీనమైనవీ ఉన్నాయి. నగరం పురాతనమైనా ప్లానింగ్ ఎంతో కచ్చితంగా కట్టబడింది. అన్ని ఇళ్లు చతురస్రాకారంలో ఉంటాయి. మూలలు కోతకోసినట్టే ఉంటాయి
భవంతులపైనున్న ఆర్కిటెక్చర్ చూసి తీరవలసిందే. ఇంత అందమైన కళాకృతులు కొలువుదీరాయిక్కడ. అందుకే రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ ఈ నగరానికి రాయల్ గోల్డ్ మెడల్‌ని
ఇచ్చింది. ప్రపంచంలో ఈ గౌరవం పొందిన ఏకైక నగరం ఇదేనంటారు.
కిలోమీటర్ల మేర పరుచుకున్న బీచ్‌లు దీని ప్రత్యేకం. 1992 వరకూ ఇక్కడ బీచ్‌లే లేవు. పరిశ్రమలతోనే ఉండేది. అయితే 92లోనే ఇక్కడ ఒలింపిక్స్ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పరిశ్రమల్ని తొలగించి బీచ్‌లను తయారు చేశారు. ఇప్పుడిక్కడున్న ఏడు బీచ్‌లు ఒక్కోటీ దాదాపుగా 4.5కిలోమీటర్ల తీర రేఖతోఉన్నాయి.
ప్రపంచంలోనే రద్దీగా ఉండే నడక దారి ఇక్కడే ఉంది. ఈ రోడ్డుపై మరే వాహనాలు పోవు. సరాసరిన రోజుకు లక్షా యాభైవేల మంది దీనిపై నడుస్తారు. నగరంలో 180 కిలోమీటర్ల మేర సైకిల్ దారులున్నాయి. సైకిళ్లు అద్దెలకిచ్చే దుకాణాలూ ఎక్కువే. అందుకే దీనికి ‘వరల్డ్ మోస్ట్ బైక్ ఫ్రెండ్లీ సిటీ’ అనే పేరుంది.
ఐరోపాలోనే అతి పెద్ద క్రూయిజ్ పోర్టు ఇక్కడే ఉంది. ఇది అతి రద్దీగా ఉండేదీనూ. ‘ఎఫ్‌సి బార్సిలోనా క్లబ్స్ హోమ్ స్టేడియం’ ఈ ఖండంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం. 99వేల మందికి పైగా ఇందులో కూర్చునే వీలుంది.
నగర విస్తీర్ణంలో పదిశాతం కంటే ఎక్కువ భూమిలో అర్బన్ పార్కులున్నాయి. వీరి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వస్తువులతో ఇక్కడ 55 మ్యూజియాలున్నాయి. వీటిల్లో ఇప్పటికీ మ్యాజిక్ షోలూ జరుగుతుంటాయి.
ఈ నగరంలోనే మొత్తం తొమ్మిది యునెస్కో గుర్తించిన కట్టడాలున్నాయి. ఈ నగరం మధ్యలో 1882లో నిర్మాణం మొదలుపెట్టిన సగ్రడా ఫెమిలియా అతి పెద్ద రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది. ఇది ఇప్పటి వరకూ ఇంకా పూర్తి కాలేదు. యునెస్కో దీని మీదున్న ఆర్కిటెక్చరల్ వర్క్‌ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.