జర్మనీ దేశ రాజధాని నగరం బెర్లిన్. ఈ నగర జనాభా సుమారు జనాభా దాదాపు 37 లక్షలు (2019). నగర విస్తీర్ణం 891.7 చదరపు కిలోమీటర్లు. జర్మనీ దేశంలో అతి పెద్ద నగరం ఇదే.
జనాభాపరంగానూ. ఇక్కడ మ్యూజియాలు చాలా ఎక్కువ. 180 వరకూ ఉన్నాయి. ఇక్కడున్న వారిలో యాభైవేల మందికిపైగా ఇతర దేశాలవాళ్లే. 185 దేశాలకు చెందిన వారు ఇక్కడుంటున్నారు.
వంతెనలకు వెనిస్ ప్రసిద్ధి. కానీ వంతెనలు అక్కడ కంటే ఇక్కడే ఎక్కువ. దాదాపు 1700 ఉన్నాయి. 180 కిలోమీటర్ల వాటర్‌వేలున్నాయి. నగరాన్ని చూడాలంటే పడవ ఎక్కి కూర్చుంటే చాలు. అంతా అదే తిప్పి చూపించేస్తుంది.
బెర్లిన్ రోడ్లపై బహిరంగంగా పొగతాగకూడదు. బెర్లిన్ ప్యారిస్ కంటే దాదాపు 8 రెట్లు పెద్దది. టాయిలెట్ ఫ్లష్‌ని కనిపెట్టింది ఇక్కడే.
ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మూడు ఒపేరా హౌస్‌లున్నాయి. అంటే హైదరాబాద్‌లో రవీంద్రభారతి లాంటి వన్నమాట. దేశంలో పచ్చని నగరంగా బెర్లిన్ నగరానికి పేరుంది. ఇక్కడ 44శాతం భూమి కాలువలు, చెట్లు, నదులు, పచ్చటి గడ్డితోనే నిండి ఉంటుంది.
బెర్లిన్ లో సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది
గుర్తొచ్చేదిదే!
బెర్లిన్ అనగానే అందరికీ ఈ టీవీ టవరే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ నగరంలో కొట్టొచ్చినట్టు ఇదే కనిపిస్తుంటుంది.
దీని పేరు ఫర్న్‌సాటర్మ్. ఇది టీవీటవర్. ఇంకా అబ్జర్వేషన్ టవర్. దీంట్లో ఓ రెస్టారెంటూ ఉంది. ఈ టవర్ 1,207 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఈ టవర్ నిర్మాణం 1965లో మొదలుపెట్టి 1969లో పూర్తి చేశారు.
ఇక్కడ బంగారపు నాణాలు వచ్చే ఏటీఎంలున్నాయి వీటినే అక్కడ గోల్డ్ వెండింగ్ మెషిన్లు అనీ పిలుస్తుంటారు. వీటిల్లో డబ్బు చెల్లించి ఎప్పుడైనా బంగారు నాణేలు తీసుకోవచ్చు. అలా 250గ్రాముల వరకూ నాణేల్ని ఇక్కడ కొనుక్కునే వీలుంటుంది.
బెర్లిన్ నగరంలో ‘ద ఈస్ట్ సైడ్ గ్యాలరీ’ పేరుతో ఓ బహిరంగ ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇది ప్రపంచంలోనే బహిరంగంగా ఉన్న అతి పెద్ద ఆర్ట్ గ్యాలరీ. చారిత్రక బెర్లిన్ వాల్‌పైనే ఇది ఉంది.
బొమ్మలన్నీ గోడలపై వరుసగా గీసి ఉంటాయి. 21 దేశాలకు చెందిన 118మంది కళాకారులు ఈ బొమ్మలు గీశారు.1.3కిలోమీటర్ల పొడవున ఇది ఉంటుంది.
నగరంలో సబ్‌వే రైల్వే వ్యవస్థ 146 కిలోమీటర్ల పొడవున ఉంది. 1902లో దీన్ని ప్రారంభించారు. మరో 120 కిలోమీటర్లేమో ట్రామ్ లైన్లు ఉన్నాయి. ఎప్పుడూ చాలా రైళ్లు, ట్రామ్‌లు నడుస్తుంటాయి. దీంతో ప్రజా రవాణా వాహనాలన్నీ ప్రశాంతంగా కనిపిస్తాయి. ఇరుక్కుని ఇరుక్కుని నిలబడే దృశ్యాలు ఇక్కడ అసలు కనిపించవు.