header

Bloemfontein….South Africa…బ్లూంఫాంటేన్‌

Bloemfontein….South Africa…బ్లూంఫాంటేన్‌ బ్లూంఫాంటేన్‌... దక్షిణ ఆఫ్రికా జ్యుడిషియల్‌ రాజధాని. ఈ దేశానికున్న మూడు రాజధాని నగరాల్లో ఇదీ ఒకటి. ఈ నగర విస్తీర్ణం 236 చదరపు కిలోమీటర్లు దేశంలో ఆరో అతిపెద్ద నగరం. జనాభా దాదాపు రెండున్నర లక్షలు (2019) ఈ నగర ప్రజలు ఎక్కువగా ఆంగ్లం, ఆఫ్రికాన్స్‌ భాషలు మాట్లాడుతుంటారు.
ఈ నగరానికి మంగ్వాంగ్‌, చిరుతల ప్రాంతం అని రకరకాల పేర్లున్నాయి. ఈ నగరం 1846లో ఏర్పాటు చేయబడింది. 1910 నుంచి దక్షిణ ఆఫ్రికా రాజధానుల్లో ఒకటిగా మారింది.
ఈ నగరంలో ఫుడ్‌, ఫర్నిచర్‌, గ్లాస్‌ పరిశ్రమలు ఎక్కువ. వ్యవసాయం, మైనింగ్‌కి ప్రధాన కేంద్రం ఈ నగరం. నగరంలోని ఆర్కిడ్‌ హౌస్‌ వేలాది రకాల ఆర్కిడ్‌ పూల మొక్కలతో కనువిందు చేస్తుంది. నగరంలోని నేషనల్‌ ఉమెన్స్‌ మెమోరియల్‌ ప్రత్యేక ఆకర్షణ. రెండో బూర్‌ యుద్ధంలో మరణించిన 27 వేల మందికి గుర్తుగా దీన్ని 1913లో ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులకు అంకితమిస్తూ నిర్మించారు. మహిళల మొదటి స్మారకస్థూపం ఇది.
నగరంలోని అగ్నిమాపక ప్రదర్శనశాల మంచి పర్యటక ప్రాంతం. పాత తరం నాటి ఫైర్‌ ఇంజిన్లు, పరికరాలు, ఫొటోలు ఉంటాయిక్కడ.
ఈ నగరానికి దగ్గర్లో ‘చీతా ఎక్స్‌పీరియన్స్‌ కన్జర్వేషన్‌ సెంటర్‌’ ఉంటుంది. ఇందులో పులులు, సింహాలు, చిరుతలూ ఉంటాయి. వాటిని దగ్గర్నించి చూడొచ్చు. ఫొటోలూ దిగొచ్చు.
బ్లూంఫౌంటేన్‌ అనే పేరుకు డచ్‌లో ఫౌంటేన్‌ ఆఫ్‌ ఫ్లవర్స్‌ అని అర్థం. సరదాగా ‘ద సిటీ ఆఫ్‌ రోజెస్‌’ అని పిలుస్తుంటారు. ఇక్కడ గులాబీ తోటలు చాలా ఎక్కువ. ఏటా రోజ్‌ ఫెస్టివల్‌ భారీ ఎత్తున జరుగుతుంది. 1976 నుంచి నిర్వహిస్తున్న ఈ వేడుకలో వేలాది గులాబీ పూల ప్రదర్శనతో పాటు రకరకాల పోటీలు పెడుతుంటారు. ఫ్లవర్‌ వాక్‌లూ ఉంటాయి.