హంగేరి దేశంలోని నగరం బుడాపెస్ట్ మరియు దేశ రాజధాని కూడా. నగర విస్తీర్ణం 525 చ.కి.మీ. హంగేరిలోని అతి పెద్ద నగరం కూడా.
1873లో బుడా, పెస్ట్, ఒబుడా అనే మూడు నగరాలు కలిసి బుడాపెస్ట్‌గాఏర్పడ్డాయి. 1873లో
యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ప్రదేశాలు ఉన్నాయి. వీటిల్లో బుడా క్యాజిల్ హిల్, చైనా బ్రిడ్జ్, హీరోస్ స్క్వేర్ ప్రఖ్యాత సందర్శక ప్రాంతాలు.
ఈ నగరంలో ఏటా ఆగస్టు నెలలో వారం రోజుల పాటు మ్యూజిక్ ఫెస్టివల్ సందడిగా జరుగుతుంది. ఇందులో లక్షల మంది పాల్గొంటారు. ఈ నగరంలో 40 థియేటర్లు, 100 మ్యూజియాలు ఉన్నాయి.
రూబిక్స్ క్యూబ్ .... ఆటబొమ్మల్లో ఇదీ ఒకటి. దీన్ని తయారు చేసిన రూబిక్ ఇక్కడి వాడే.
నగరంలో వేడి నీటి బుగ్గలు చాలా ఎక్కువ. అందుకే ‘సిటీ ఆఫ్ బాత్స్’ అని దీనికి పేరు. సహజ సిద్ధమైన ఈ వేడి నీటి బుగ్గల్లో స్నానాలు చేస్తే వ్యాధులు తగ్గుతాయని నమ్ముతారు. వీటికి మెడికల్ బాత్స్‌గా పేరు. ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు.
ఇక్కడ చిల్డ్రన్ రైల్వే ఉంది. టీసీ దగ్గర్నించి సిగ్నల్స్ ఆపరేటర్, విచారణ అధికారి వరకూ అందరూ పిల్లలే. రైల్వే అధికారుల విధుల్ని, రైల్వేశాఖ గురించి స్వయంగా విద్యార్థులే తెలుసుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం పిల్లలకు నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తారు.
బుడాపెస్ట్ పార్లమెంట్ భవంతి ప్రపంచంలోని మూడో అతిపెద్ద పార్లమెంట్ భవనం. ఇందులో 691 గదులు, దాదాపు 20 కిలోమీటర్ల పొడవైన మెట్ల దారి ఉంటాయి. ఈ భవంతి ఏకంగా 315 అడుగుల ఎత్తుంటుంది.
నగరంలోని సబ్‌వే లైన్ ప్రపంచంలోని పురాతనమైన సబ్‌వే లైన్లలో ఒకటి. 1896లో మొదలైంది.
ప్రపంచంలోని పురాతనమైన జంతు ప్రదర్శనశాలల్లో ఇక్కడి జూ ఒకటి. 1865లో ప్రారంభమైన ఈ జూలో వెయ్యి జాతులకు చెందిన పదివేలకుపైగా జంతువులున్నాయి.