డెన్మార్క్ దేశ రాజధాని నగరం కోపెన్‌హాగన్. డెన్మార్క్ లోని కోపెన్‌హాగన్ నగర విస్తీర్ణం 178 చదరపు కిలోమీటర్లు జనాభా సంఖ్య సుమారు ఏడున్నర లక్షలు.
ఇదివరకు ఇది జాలర్ల గ్రామం. నౌకాశ్రయం ఉండటంతో సముద్రపు దొంగలు చాలాసార్లు ఈ ఊరు మీద పడి దోచుకునేవారు. ప్రస్తుతం మహానగరంగా మారిపోయింది.
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడీ నగరపాలకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన, సౌర విద్యుత్తులనే వాడకం ఎక్కువ. ఫలితంగా అంతకు ముందున్న ఉద్గారాలు మూడొంతులు తగ్గిపోయాయి.
చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఖాళీ స్థలాలన్నింటినీ ప్రభుత్వం పార్కులుగా మారుస్తూ వస్తోంది. ప్రజల్ని పచ్చదనానికి దగ్గర చెయ్యాలనే చిన్న చిన్న పార్కుల్ని ఏర్పాటు చేసింది. అందుకే ఈ నగరంలో చెట్లు, మొక్కలు ఎక్కువగానే కనిపిస్తాయి.
‘వరల్డ్ హాపీయెస్ట్ సిటీస్’లో ఇదొకటి. ఇక్కడి ప్రజలు బయటి వారితోనూ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు.
ప్రపంచంలో అతి పురాతన అమ్యూజ్‌మెంట్ పార్కుగా ఇక్కడి బాకెన్‌కు పేరుంది. దీన్ని 1883లోనే కట్టారు. ఈ పార్కులో ఒకచోట నుంచి ఇంకో చోటికి వెళ్లడానికీ రోలర్‌కోస్టర్‌లలాంటి రైడ్లుంటాయి.
ఇదే నగరంలో ఉన్న కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి సొంత కోర్టు, చట్టాలు ఉండేవి. సొంతంగా ఓ జైలూ ఉండేది. 1771 తర్వాత ఈ విశ్వవిద్యాలయం ఈ నగర పాలన కిందికి వచ్చింది. దీంతో ఆ చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి.
ఈ నగరవాసులు సాకర్, హ్యాండ్‌బాల్‌లను ఇష్టంగా ఆడతారు.
రోడ్ల పక్కన చాలా మంది సైకిళ్లకు తాళాలు వెయ్యకుండానే పెట్టేస్తారు.
నగరం మధ్యలో ఉన్న స్ట్రోగెట్ షాపింగ్ స్ట్రీట్ ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం. ఈ నగరంలో నివసించేవారిని కోపెన్‌హాగనర్స్ అని పిలుస్తుంటారు. వీరికి సైకిళ్లంటే భలే ఇష్టం.
ఉద్యోగుల్లో సగం మందికి పైగా రోజూ సైకిళ్ల మీదే వెళతారు.నగరంలో 250 మైళ్ల సైకిల్ దారులున్నాయి. ఈ ఊరి శివారుల్లో ఉన్న ఊళ్లను కలపడానికి సూపర్ హైవే ఏర్పాటు చేసారు. దీని మీద ఇంక వేరే పెద్ద వాహనాలేం రావన్న మాట.
నగరం మొత్తంలో అక్కడక్కడా కృత్రిమంగా నిర్మించిన ద్వీపాలుంటాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వీటిని భద్రతా అవసరాల కోసం నిర్మించారు. అయితే ఇప్పటికీ అవి మిలటరీ బేస్‌లుగా ఉన్నాయి.
ప్రభుత్వ నిబంధనలు, చట్టాల్ని ఇక్కడి వారంతా కచ్చితంగా పాటిస్తారు. రోడ్డు ఖాళీగా ఉన్నా పచ్చలైటు పడే వరకు ఆగుతారు. దొంగతనాలూ తక్కువే.
కోపెన్‌హాగన్ తీరంలో ఉన్న ఓడరేవుకు పరిశుభ్రమైన రేవుగా పేరుంది. ఇక్కడి నీళ్లూ దిగి స్నానం చేసేందుకు వీలైనంత స్వచ్ఛంగా ఉంటాయి.