జర్మనీలోని ప్రముఖ నగరాల్లో ఫ్రాంక్‌ఫట్ ఒకటి. ఈ నగర జనాభా సుమారు : 7లక్షల 46వేలు. నగర విస్తీర్ణం 248 చదరపు కిలోమీటర్లు. ఈ నగరంలో నివసించే ప్రజల్ని ఫ్రాంక్‌ఫటర్స్ అంటారు. జర్మనీ ప్రాచీన చరిత్రలోనూ ఈ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ దేశ రాజులకు ఇక్కడే కిరీటం పెట్టి పట్టాభిషేకాలు చేసేవారు.
ఈ నగరానికి హాపీయెస్ట్ సిటీగా దీనికి పేరుంది.నాణ్యమైన జీవనం ఉండే నగరాల్లో ఇదీ ఒకటి. ఈ నగరంలో ఉన్న స్టాక్‌మార్కెట్ భవనం చాలా పెద్దది. ప్రపంచ స్టాక్ మార్కెట్ పెద్ద భవనాల్లో ఇదీ ఒకటి.
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే నగరంలోని ఒపేరా హౌస్‌కు చాలా అందమైనది అంటారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఈ హౌస్ చాలా దెబ్బతింది. తరువాత 1981 తర్వాత బాగుచేయబడింది.
ఐరోపా ఖండంలోనే అతి పెద్ద కార్గో ఎయిర్‌పోర్ట్ ఇక్కడిదే. అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇక్కడిదీ ఒకటి.
ఫ్రాంక్‌ఫట్ జూలో 4,500కుపైగా జంతువులు, పక్షులూ ఉన్నాయి. 32 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఈ పార్కు. జర్మనీలో ఉన్న జంతుప్రదర్శన శాలలో ఇది రెండో అతి ప్రాచీనమైనది.
నగరంలోనే 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అడవి.. ఇక్కడి భూమిలో దాదాపు మూడింట ఒక వంతు భూమి ఈ అడవిలోనే ఉంది. ఈ అడవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఉష్ణమండల, సమశీతోష్ణ, ధ్రువప్రాంత... అన్ని వాతావరణాలకు సంబంధించిన మొక్కలూ ఈ అడవిలో ఉన్నాయి.
ప్రపంచ జనాభా ఇష్టంగా తినే హాట్‌డాగ్‌లను తయారు చేసింది ఇక్కడే.
ఈ నగరం పర్యాటకపరంగా కూడా పేరుపొందింది. ఏటా 40 లక్షల మందికి పైగా పర్యటకులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు.
మెయిన్ నదికి దక్షిణం వైపున మ్యూజియం డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడే ఎన్నో మ్యూజియాలు కొలువుదీరాయి. ఐరోపాలోని జాతులకు సంబంధించిన మ్యూజియాలూ ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికాలకు సంబంధించిన కళాఖండాలూ 65 వేలకుపైగా ఉన్నాయి. అయితే వీటన్నింటిలో సెన్కెన్‌బర్గ్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రముఖమైనది