దక్షిణ అమెరికా ఖండంలోనే ఐదో అతిపెద్ద నగరం లీమా. ఈ నగరం పెరూ దేశపు రాజధాని కూడా. నగర విస్తీర్ణం 2,672 చ.కి. జనాభా దాదాను 90 లక్షలు. లీమా నగరం పెరూ దేశపు వాణిజ్య కేంద్రం కూడా.
ఈ నగరం పసిఫిక్ సముద్రతీరంలో 80 కి.మీటర్ల సముద్రతీరం కలిగి ఉంది. ఈ నగర ఉనికిని మొదటి సారిగా 1535 సం.లో స్పానిష్ యాత్రికుడు ఫ్రాన్సిస్కో పిజారో కనిపెట్టాడు.
1821 సం.లో పెరూ దేశం స్పానిష్ వారి నుండి స్వాతంత్ర్యతం పొందింది. అప్పటి నుండి లీమా దేశరాజధానిగా మారింది. కానీ 90 శాతం మంది ప్రజలు స్పానిష్ భాషనే మాట్లాడుతారు.
భిన్న సంస్కృతులు కలగలసిన ప్రాంతం కావటం వలన రకరకాల ఆహారపదార్ధాలు లభ్యమవుతాయి. చేపల వంటకాలు ప్రసిద్ధి ఈ నగరం.
ఈ నగర ప్రజలు పసుపు రంగును తమ అదృష్ణ చిహ్నంగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం రోజున పసుపు రంగు దుస్తుల్ని ధరిస్తారు. పసుపు రంగు పూలను కొంటారు. నూతన సంవత్సర వేడుకలలో ఈ రంగే ఎక్కువగా కనిపిస్తుంది. డిసెంబరు 31 రాత్రి సరిగ్గా 12 గంటలు కాగానే 12 ద్రాక్ష పండ్లు తింటారంతా. ఇక్కడి సంప్రదాయమిది.
ఈ నగరానికి పర్యాటక పరంగా దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. మ్యూజియాలు, ప్రదర్శనలు, ఆర్ట్ గ్యాలరీలు, అడ్వెంచర్లు, అందమైన సముద్ర తీరాలు, పండగలు, ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.
నగరంలోని పరక్ డె లా రిజర్వ్ పార్కు ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటేన్ కాంప్లెక్స్. ఇందులో చాలా ఫౌంటేన్లు ఉంటాయి. ఈ పార్కులో అడుగు పెట్టగానే ఎక్కడ చూసినా రకరకాల ఆకారాల్లో నీళ్లను వెదజల్లుతున్న ఫౌంటేన్లు దర్శనమిస్తాయి. రాత్రివేళల్లో అయితే రంగు రంగుల్లో కనువిందు చేస్తుంటాయివి.
పర్యాటకులు ఎక్కువగా తమ టూర్‌ని ఇక్కడి ప్లాజా మేయర్ నుంచి మొదలు పెడతారు. ఇది లీమా నగరం పుట్టిన చోటుగా చెబుతుంటారు. వందలాది దుకాణాలు, రెస్టారెంట్లు ఉన్నాయి ఇక్కడ.