header

Manila City… Philippines…మనీలా ...ఫిలిప్పీన్స్‌

Manila City… Philippines…మనీలా ...ఫిలిప్పీన్స్‌ ‌ ఫిలిప్పీన్స్‌ దేశంలోని మనీలా నగర జనాభా సుమారు పదిహేడు లక్షలు ఈ నగర విస్తీర్ణం దాదాపుగా 42 చదరపు కిలోమీటర్లు. మనీలా నగరం ఫిలిపైన్స్ దేశ రాజధాని కూడా. నగరంలో జనసాంద్రత ఎక్కువ. ఫిలిపైన్స్ దేశంలోని 16 మహానగరాలలో మనీలా ఒకటి. నగరంలో టాగలాగ్‌ అనే భాషను మాట్లాడతారు. దీని వ్యాకరణాన్ని అరబిక్‌, చైనీస్‌, స్పానిష్‌, సంస్కృతాల నుంచి తీసుకున్నారు. రాజధానిలో మాత్రమే ఎక్కువగా ఈ భాష వాడుకలో ఉంది. నగరమంతా వ్యాపరంతో సందడిగా ఉంటుంది. డాక్టర్‌ జోస్‌ రిజాల్‌ అనే వ్యక్తిని ఈ దేశ ‘నేషనల్‌ హీరో’గా చెబుతారు. మనీలా స్పెయిన్‌ వాళ్లఆక్రమణలో ఉన్నప్పుడు ఇతను ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. రచయిత కూడా. ఆయన గౌరవార్థం ఇక్కడ రిజాల్‌ పార్క్‌ని నిర్మించారు. 60 హెక్టార్లలో పార్కుతోపాటు ఆడిటోరియం కూడా ఉంటుంది. . ఈ నగర వాసులకు బాస్కెట్‌బాల్‌ ఆడటం ఎంతో ఇష్టం. ఈ సిటీకి ఒక ప్రొఫెషనల్‌ లీగ్‌ కూడా ఉంది. ప్రపంచంలోనే అతి ప్రాచీన చైనా టౌన్‌ ఉన్నదిక్కడే. 1594లోనే టౌన్‌ ఏర్పడింది. ఇప్పుడిక్కడ చైనా వారితోపాటు చాలా మంది ఫిలిప్పినోలు కూడా వ్యాపారాలు చేసుకుంటుంటారు. చైనా వస్తువులు, స్ట్రీట్‌ ఫుడ్‌కి ఎక్కువగా దొరకుతాయిక్కడ. ఈ దేశ ప్రెసిడెంట్‌ నివాసం ‘మే లాకన్‌ దియన్‌’ ఉన్నది ఈ నగరంలోనే. ఈ దేశంలో ఎంతో పేరున్న శాన్‌అగస్టిన్‌ చర్చి ఉన్నది ఈ నగరంలోనే. ఇది ఇక్కడి ప్రాచీన చర్చి. 1587-1606 సంవత్సరాల మధ్య దీన్ని నిర్మించారు. ఫిలిప్పీన్స్‌ చరిత్రకు సంబంధించిన ఆర్ట్‌ వర్క్‌లను చూడాలంటే ఇక్కడి అయాలా మ్యూజియం చూడవలసిందే. దీంట్లోనే ఒక హెరిటేజ్‌ లైబ్రరీ కూడా ఉంది. నగరంలో చారిత్రాత్మక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలున్నాయి. మనీలా హార్బర్ ఫిలిపైన్స్ లో ప్రధాన నౌకా స్థావరం. ఈ నగరం కింద కొన్ని సొరంగాలున్నాయి. అవన్నీ రెండో ప్రపంచ యుద్ధానికి ముందువే. అయితే ద ఫోర్ట్‌ బోనిఫేసియో టన్నెల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీంట్లో 32 ఛాంబర్లు ఉన్నాయి. 2.24 కిలోమీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పుతో ఇదుంటుంది. అంటే ఇందులో చిన్న తోపుడు బండినీ నడిపించుకుని తీసుకెళ్లిపోవచ్చు. దీనిలోంచి వెళితే ఆ పక్కనే ఉన్న మకాటి సిటీ వచ్చేస్తుంది. పర్యాటకపరంగా కూడా మనీలా నగరం అభివృద్ధి చెందింది. ఏటా లక్షలాది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తారు. షాపింగ్ మాల్స్ కు మనీలా పెట్టింది పేరు. పర్యాటక పరంగా ఇక్కడున్న చారిత్రక కట్టడాల్లో ముఖ్యమైనది శాన్‌టియాగో కోట. దీన్ని 1571లో స్పానిష్‌వారు కట్టారు. ఫిలిప్పీన్స్‌ అంతా కాదుగానీ మనీలా ఒక్కటే 1762 నుంచి రెండేళ్లపాటు బ్రిటిషర్ల పాలనలోకి వెళ్లింది. అయితే దీని సరిహద్దులు దాటి వారి పాలన బయటకు వెళ్లలేదు నగరంలోని ఎస్కోల్టా స్ట్రీట్‌ పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఈ దేశంలో మొట్టమొదటగా ఇక్కడే ప్రారంభమైనవని కొన్ని ఈ వీధిలో ఉన్నాయి. మొదటి ఐస్‌క్రీం దుకాణాన్నీ ఇక్కడ చూడొచ్చు. మొదటి సినిమా హౌస్‌, సెలూన్‌, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌, కేబుల్‌కార్‌, ఎలివేటర్‌లాంటివీ ఇక్కడే ఉన్నాయి.