మెక్సికో సిటీ దేశ మెక్సికో రాజధాని. ఈ నగరం మొత్తం టెక్స్‌కోకో అనే సరస్సుపై 1325లో నిర్మితమైంది. ఉత్తర అమెరికా ఖండంలో అత్యంత పాత నగరాల్లో ఇదీ ఒకటి. దాదాపు 700 సంవత్సరాల చరిత్ర ఈ నగర సొంతం. ఇదివరకు స్పానిష్ రాజుల పరిపాలనలో ఉండట వలన అప్పటి కాలానికి చెందిన భవనాలు ఎక్కువగా ఉన్నాయి. నగరప్రజలు ఎక్కువమంది స్పానిష్ భాష మాట్లాడుతారు. నగర విస్తీర్ణం 14వందల 85 చదరపు కిలోమీటర్లు. జనాభా 89లక్షలు. అమెరికన్లు ఈ నగరంలో ఎక్కువగా ఉన్నారు. ఆరులక్షల మందికి పైగా ఇక్కడ నివసిస్తున్నారు.
మెక్సికో సిటీకి సిటీ ఆఫ్ ప్యాలెసెస్, సిటీ ఆఫ్ హోప్, క్యాపిటల్ ఇన్ మూమెంట్ లాంటి చాలా పేర్లున్నాయి. ప్రపంచ ధనిక నగరాల్లో మెక్సికో నగరం ఒకటి.
మెక్సికో సిటీ మెట్రో ప్రపంచంలో అత్యంత చవకైన మెట్రోల్లో ఒకటి. టిక్కెట్టు ధర మూడు పెసోల నుంచే ప్రారంభమవుతుంది. మొత్తం 195 మెట్రో స్టేషన్లతో 226 కిలోమీటర్ల దూరం ఈ లైన్లు విస్తరించి ఉన్నాయి. రోజూ నలభై నుంచి యాభై లక్షల మంది మెట్రో రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు.
మెక్సికో సిటీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మెక్సికో అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమిది. ప్రసిద్ధ స్పానిష్ విశ్వవిద్యాలయాల్లో టాప్ ర్యాంకులో ఉంది.
నగరంలోని అల్మెడా సెంట్రల్ పార్కు అమెరికా ఖండంలో మొదటి అర్బన్ పార్కు. 1592లోనే దీన్ని తీర్చిదిద్దారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద సాకర్ స్టేడియం ఈ నగరంలోనే. దీని పేరు ఎస్టాడియో అజ్‌టెకా స్టేడియం.
నగడరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువ. కాలుష్యమూ అధికమే. పావు గంటలో చేరే చోటికి ఒక్కోసారి మూడు గంటల సమయం పడుతుంటుంది. అందుకనే ఇక్కడుండే అత్యంత ధనవంతులు ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికి సొంత హెలికాఫ్టర్లలోనే తిరుగుతుంటారు. లాటిన్ అమెరికా దేశాల్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇక్కడున్నది మొదటిది.
మెక్సికో సిటీలో మ్యూజియాఎక్కువగా ఉన్నాయి. నగరం మొత్తం మీద 150కి పైగా వస్తు ప్రదర్శనశాలలు ఉన్నాయి. అనధికారికంగా ఇంకో 200పైనే ఉన్నాయని చెబుతారు.
ఐమ్యాక్స్ థియేటర్లకూ ఈ నగరం ప్రసిద్ధి. ఇవి ఎక్కువగా ఉన్న నగరాల్లో మొదటిది ఇదే.
మెక్సికో నగరంలో 60కిపైగా రేడియో స్టేషన్లున్నాయి. పోలీసులు ఎక్కువగా ఉండే ప్రపంచ నగరాల్లో ఒకటి. ప్రతి వంద మంది ప్రజలకీ ఒక పోలీసు ఉన్నాడంటారు. ఒకప్పుడు నేరాలు ఎక్కువగా ఉండేవిగానీ ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయి.