ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ ఐరోపా ఖండంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటి. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో పారిస్ ఏర్పడింది. అంతకు ముందు దీన్ని లుటేటియా అని పిలిచేవారు ఈ నగర పరిధిలో ఉన్న అర్బన్, మెట్రో ప్రాంతాలున్నాయి. ఈ నగర జనాభా 22,06,488 (2019)
ఏటా కోటీ ముప్ఫై లక్షల మందికి పైగా ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు.
ఇక్కడున్న అతి ప్రాచీనమైన వంతెన పేరు ‘న్యూబ్రిడ్జ్’. 16వ శతాబ్దంలో కట్టబడింది.
పారిస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఈఫిల్ టవరే. దీని నిర్మాణం 1887లో మొదలై 1889లో పూర్తయ్యింది. 1889లో అక్కడ జరిగిన వరల్డ్ ఫెయిర్‌కి గుమ్మం(ఎంట్రన్స్)లా ఉంచేందుకు దీన్ని తయారు చేశారు. దీని రూపశిల్పి స్టీఫెన్ సువెస్ట్రే. ముందు దీన్ని కొన్ని రోజుల్లోనే తీసేయాలని అనుకున్నారు. అయితే అది దశాబ్దాలు గడిచినా చక్కగా ఉంది. అప్పటి నుండి ఫ్రాన్స్ సంస్కృతికి ఇది గుర్తుగా భావించడం మొదలుపెట్టారు.
పర్యాటక ఆకర్షణగానూ మారడంతో దీనికి తరచుగా మరమ్మతులు చేస్తూ కాపాడుకుంటున్నారు. ఈ టవర్ 1,063 అడుగుల పొడవుంటుంది. 81 అంతస్తులుంటాయి దీనిలో.
పారిస్ నగరంలోని మెట్రో వ్యవస్థ ప్రపంచంలోని పెద్ద ప్రజా రవాణా వ్యవస్థల్లో నాలుగోది. మొత్తం 302 స్టేషన్లున్నాయి. చాలా రైల్వే స్టేషన్లలో పియానోలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని ఎవరైనా ఉపయోగించవచ్చు.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పేరు గుర్తురాగానే మనందరికీ అమెరికాలోని న్యూయార్కే గుర్తొస్తుంది. కానీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలు పారిస్‌లోనే ఐదున్నాయి. ఫ్రాన్స్ మొత్తంలో పదున్నాయి. అమెరికాకు ఆ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చిందీ ఫ్రాన్సే.
ఈ నగర వాసులు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తారు. సైకిళ్లుఎక్కువగా ఉపయోగిస్తారు.. ఇక్కడ 500 కిలోమీటర్లకుపైగా దూరం బైక్ ట్రాక్‌లున్నాయి.
ఈ నగరంలో నాలుగులక్షల డెబ్భైవేల చెట్లున్నాయి. లెక్కలు పక్కాగా ఉండేందుకు వాటినీ లెక్కిస్తారిక్కడ. ఈ నగరం మొత్తంలో చాలా తలలేని విగ్రహాలు కనిపిస్తుంటాయి. కానీ వింతగా విగ్రహంలోని మనిషి పేరు డెనిస్. దాదాపు 1500 ఏళ్ల క్రితం రోమన్‌లు క్రైస్తవ మతం తీసుకోమంటే డెనిస్ ఒప్పుకోలేదు. దీంతో వారు ఆయన తలను నరికివేశారు. ఇలా ఇక్కడ దాదాపుగా 2000 మంది ప్రాణత్యాగం చేశారు. అందుకు గుర్తుగా డెనిస్ విగ్రహాలను ఇలాగ ప్రతిష్ఠించారు.
పారిస్ నగరంలో ఏకంగా నాలుగువందలకు పైగా సినిమా తెరలున్నాయి. ఇందులో వంద ప్రభుత్వానివే!
నగర వీధులలో సగటున చూసుకుంటే రోజుకు పది వరకూ సినిమా షూటింగ్‌లు జరుగు తుంటాయి. చిత్రాలుకాకుండా డాక్యుమెంటరీలు, టీవీ షోల షూట్లయితే అనేకం. నగర వీధుల్లో షూటింగ్ ఉచితం. కాకపోతే ఉద్యానవనాలు, స్విమ్మింగ్‌పూల్‌లు, మ్యూజియాల్లాంటి వాటి దగ్గర జరిగితే మాత్రం నగర ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుంది.