రియో డి జనీరో నగరం బ్రెజిల్ దేశానికి చెందిన నగరం. నగర విస్తీర్ణం 1221 చ.కి. జనాభా సుమారు 66 లక్షలు. ఈ నగరం 1565 సం. లో పోర్చుగీసు వారిచే ఏర్పాటు చేయబడింది. రియో డి జనీరో... బ్రెజిల్‌లో రెండో అతిపెద్ద నగరం.
నగరంలో క్రైస్ట్ ద రిడీమర్ ప్రముఖ పర్యటక ప్రాంతం. ఈ యేసుక్రీస్తు విగ్రహానికి ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్ట్ డెకో శైలి విగ్రహంగా పేరు. ఈ విగ్రహం ఫ్రాన్స్‌లో తయారు చేయబడి ఈ నగరానికి తీసుకురాబడింది. 124 అడుగుల ఎత్తుతో ఎత్తయిన పర్వతంపై కొలువుతీరింది. పైనుంచి చూస్తే నగరమంతా కనిపిస్తుంటుంది.
అట్లాంటిక్ తీరంలో ఉండే ఈ నగరం ప్రపంచంలోని అందమైన నగరాలలో ఒకటి. దీన్ని ‘మార్వలెస్ సిటీ’ అంటారు.
కార్నివాల్స్‌కు ఈ నగరం పేరు పొందింది. ఏటా కార్నివాల్స్ అధిక సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. లక్షలాది మంది పాల్గొని చిత్ర విచిత్ర వేషాలతో సందడి చేస్తుంటారు. ఇక్కడి సంప్రదాయ సంగీతనృత్యాలు సాంబా, బోసా నోవా. ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడానికి 200కిపైగా సాంబా నృత్యం నేర్పించే స్కూళ్లున్నాయి.
ఈ నగరం సుందరమై బీచ్‌లకు పెట్టింది పేరు. ఇక్కడి 30 బీచ్‌ల్లో పర్యటకులు సందడి చేస్తుంటారు. ఈ తీరాల దగ్గర్లో 74 కిలోమీటర్ల సైకిల్ దారులూ ఉంటాయి. నగర వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఎండాకాలంలో 35 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే శీతకాలంలో 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
రియో డి జనీరో నౌకాశ్రయంలో ఇంచుమించు 130 దీవులున్నాయి. వీటిల్లో స్నేక్ ఐలాండ్ ఉంది. ఏటా 30 లక్షల మంది సందర్శకులు వస్తుంటారిక్కడకు.
నగరంలోని టిజుక జాతీయ ఉద్యానవనం అతి పెద్ద అర్బన్ ఫారెస్టుల్లో ఒకటి. ఇక్కడ పురాతన స్ట్రీట్ ట్రామ్ వ్యవస్థ ఉంది. ది శాంటా థెరెసా ట్రామ్ 1877 సంవత్సరంలో మొదలుపెట్టబడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది
రియోలోని ఓడరేవు ప్రపంచంలో సహజ సిద్ధమైన రేవులలో ఒకటి. రేవు దగ్గరే 1299 అడుగుల ఎత్తయిన సుగర్‌లోఫ్ పర్వతం ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది.