సెయింట్ పీటర్స్‌బర్గ్... రష్యాలో రెండో అతి పెద్ద నగరం.
నగర విస్తీర్ణం: 1,439 చదరపు కిలోమీటర్లు నగర జనాభా దాదాపు 53 లక్షలు. ఈ నగరం 18వ శతాబ్దం మొదట్లో చక్రవర్తి పీటర్ I స్థాపించబడింది.
ఈ నగరం రష్యాలోని నేవా నది ఒడ్డున ఫిన్లాండ్ అఖాతం దగ్గర బాల్టిక్ సముద్ర తీరంలో ఉంది. ఈ నగరం అద్భుతమైన ఆర్కిటెక్చర్ భవంతులతో కనువిందు చేస్తుంది.
నగరంలో మొత్తం 42 దీవులున్నాయి. ఇంకా దీని మీదుగా 40 నదులు ప్రవహిస్తుంటాయి. అందుకే దీన్ని ‘ది వెనిస్ ఆఫ్ ది నార్త్’ అని పిలుస్తారు. నగరంలో 10 శాతం నేల నీటితోనే ఉంటుంది.
ఇంచుమించు 300 ప్రదర్శనశాలలుంటాయి ఈ నగరంలో. వీటిల్లో హెర్మిటేజ్ మ్యూజియం ప్రపంచంలోని పురాతనమైన మ్యూజియాల్లో ఒకటి. 1500 గదులతో ఉంటుంది. వీటిల్లో లక్షల్లో కళాఖండాలు ప్రదర్శించారు. ఒక్కో దాన్ని చూడ్డానికి ఒక్క నిమిషం కేటాయించినా ఈ మ్యూజియంలో కళాకృతులన్నీ చూడ్డానికి 8 ఏళ్లు పడుతుందంటారు.
.
ప్రతి సంవత్సరం ఈ నగరంలో 20 అంతర్జాతీయ ఆర్ట్, మ్యూజియంల ఉత్సవాలు జరుగుతుంటాయి.
రష్యాలో మొత్తం మీద అత్యంత హరిత నగరం ఇదే. 200 పైగా పార్కులూ, తెక్కలేనన్ని చెట్లతో పచ్చ పచ్చగా ఉంటుందీ నగరం.
ఇక్కడి పీటర్ అండ్ పాల్ కోట నగరంలో నిర్మించిన మొదటి కట్టడం. ఇదివరకు జైలుగా వాడేవారట.
ఈ సిటీని కాఫీ క్యాపిటల్‌గా పిలుస్తారు. ఇక్కడ కాఫీ షాపుల్లో ఎన్నో రకాల కాఫీలు లభ్యమవుతాయి.
నగరంలో ప్రత్యేక ఆకర్షణ ‘వైట్ నైట్స్’. వేసవికాలంలో దాదాపు 21 రోజులు జూన్ 11 నుంచి జులై 2 వరకు సూర్యుడు అస్తమించడు. రోజంతా... 24 గంటలూ పగలే. ఈ సమయంలో ‘లేట్ నైట్ వాక్స్’ అంటూ ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకుంటారు. వైట్ నైట్స్ ఫెస్టివల్ జరుపుకుంటారు. వీటిని చూడ్డానికి పర్యాటకు చాలా ప్రాంతాల నుండి వస్తారు.