స్టాక్‌హోం, స్వీడన్ దేశానికి చెందిన నగరం. అంతేకాదు దేశ రాజధాని నగరం కూడా. దేశంలోనే అతి పెద్ద నగరం. దేశం మొత్తం జనాభాలో 22 శాతం ప్రజలు ఇక్కడే నివసిస్తున్నారు. నగర విస్తీర్ణం 188 చదరపు కిలోమీటర్లు జనాభా సుమారు పది లక్షలు.
స్వీడన్ దేశంలో అక్షరాస్యత 99 శాతం. ఏటా స్టాక్‌హోం నగరంలోని గ్రంథాలయాల నుంచి ఇక్కడి ప్రజలు 40 లక్షల పుస్తకాలు తీసుకుని చదువుతుంటారు.
ప్రపంచంలో జాతీయ పట్టణ ఉద్యానవనమున్న ఏకైక రాజధానీ నగరమిది. ఈ పార్కు పేరు రాయల్ నేషనల్ సిటీ. తొమ్మిదిన్నర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ పార్కులో జింకలు, కుందేళ్లు, నక్కలు, రకరకాల జాతుల సీతాకోక చిలుకలు, పక్షులు ఈ ఉద్యానవనంలో ఉన్నాయి.
ప్రఖ్యాత నోబెల్ బహుమతిని స్థాపించిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ది ఈ నగరమే. ఈ బహుమతుల ప్రదానోత్సవం జరిగేది ఈ నగరంలోనే. భౌతిక, రసాయన, వైద్యశాస్త్రాల్లో, సాహిత్య విభాగాల్లో నోబెల్ బహుమతుల్ని ఏటా ఈ నగరంలోనే ఇస్తుంటారు. 1901లో మొదటి నోబెల్ బహుమతుల ప్రదానోత్సవం కూడా ఇక్కడే జరిగింది.
మలారిన్ మంచి నీటి సరస్సు బాల్టిక్ సముద్రం వైపు పారే చోట 14 దీవుల సముదాయంగా ఉంటుందీ నగరం. ‘బ్యూటీ ఆన్ ది వాటర్’ అనే ముద్దు పేరూ ఉందీ నగరానికి. మొత్తం నగరం 30 శాతం నీటి దారుల మధ్య ఉంటే 30 శాతం భాగం ఉద్యానవనాలతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది.
ప్రపంచంలో అనేక చోట్ల ఉన్న ప్రముఖ ఫర్నీచర్ చైన్ నెట్‌వర్క్ ఐకియా సంస్థ ప్రారంభమైంది ఇక్కడే. 1943లో మొదలైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
సైకిళ్ల కోసం ప్రత్యేక దారులుంటాయిక్కడ. రోజూ 70 వేల మందికిపైగా సైకిళ్లపై ప్రయాణిస్తుంటారు.
ఈ నగరంలోని సబ్‌వే ప్రపంచంలోనే పొడవైన ఆర్ట్ గ్యాలరీ. ఇందులోని అందమైన చిత్రలేఖనాలు, శిల్పాలు కనువిందు చేస్తుంటాయి. 1950సం.లో ప్రారంభమైంది.
ఈ నగరంలోని అతి పురాతనమైన నిర్మాణం 'ది రిడార్ హొల్మెన్ చర్చ్' 1270 సంవత్సరం నాటిదిది . ప్రపంచంలోనే అతి పెద్ద అర్ధగోళాకార భవంతి ఉండేది ఇక్కడే. తెల్లని బంతిలా ఉంటుందీ భవనం.
నగరంలో ఇంచుమించు 100 మ్యూజియాలున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. నోబెల్ మ్యూజియమూ ఉంటుంది. ఇందులో నోబెల్ బహుమతులకు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి.