header

Tokyo…. Japan…టోక్యో...

Tokyo…. Japan…టోక్యో... ‌ జపాన్‌ దేశ రాజధాని టోక్యో. ప్రపంచంలో అతి పెద్ద నగరం కూడా. జపాన్ లోని హోన్షూ దీవిలో తూర్పుదిశగా ఉంది. ఈ నగర విస్తీర్ణం 2187.66 చ.కి.మీ. జనాభా సుమారుగా1కోటి 37 లక్షలు. ప్రపంచంలో మూడు ప్రధాన వాణిజ్య మహా నగరాల్లో ఇదీ ఒకటి. 1868లో దీన్ని జపాన్‌ రాజధానిగా మార్చి టోక్యోగా పేరు మార్చారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం టోక్యో.
టోక్యోలో క్రైస్తవం, బౌద్ధం, షింటో ముఖ్య మతాలు.. జపాన్ లో ప్రధానమైన వాణిజ్య కేంద్రం. పాశ్చాత్య మహానగరాలలోని జీవనశైలి టోక్యో నగరంలో ప్రతిబింబిస్తుంది.
టోక్యోలో భూకంపాలు ఎక్కువ. 1923లో వచ్చిన భూకంపం వలన 1,42,000 మంది చనిపోయారు.
టోక్యో నగరంలో సౌకర్యాలు ఎక్కువ ప్రతి 12 మీటర్ల దూరానికో వెండింగ్‌ యంత్రం ఉంటుంది. ఇందులో అవసరమైన దుస్తులు, క్యాండీలు, డ్రింక్స్‌, పాలు, ఐస్‌క్రీమ్స్‌ వంటివి కొనవచ్చు.
నగరంలో చెర్రీ చెట్లు ఎక్కువ. ఈ పూల చెట్లు ఏప్రిల్‌ నెలలో మొదటి రెండు వారాలు పూస్తాయి. ఈ కాలాన్ని హనామి అని పిలుస్తారు.
జపాన్ చక్రవర్తి నివసించే రాజప్రసాదం నగరంలో నడిబొడ్డున కలదు. పార్లమెంట్ రాజప్రసాదానికి వాయువ్యదిశలో కలదు. పార్లమెంట్ నే డైయెట్ అనికూడా అంటారు. రాజప్రసాదానికి నైరుతీ దిశలో ఉన్న మెయిజీ క్షేత్రం జపాన్ లోని పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ ప్రసిద్ధి గాంచినది.
టోక్యో నగరం ఖరీదైన హోటళ్లకు పెట్టింది పేరు. నగరంలోని రిట్జ్‌ కార్ల్‌టన్‌ హోటల్‌ ప్రపంచంలోని ఖరీదైన హోటళ్లలో ఒకటి. ఇక్కడ ఒక్క రోజు రాత్రి ఉండటానికి భారతీయ కరెన్సీలో ఆరున్నరలక్షల రూపాయలు ఖర్చుపెట్టాలి. అమెరికా బయట మొదటి డిస్నీల్యాండ్‌ని నిర్మించింది ఇక్కడే. 20 వేల మంది ఉద్యోగస్థులు పనిచేస్తారిక్కడ.
నగరంలో ఈఫిల్‌ టవర్‌లానే ఎత్తయిన టవర్‌ ఉంది. పేరు టోక్యో టవర్‌. దీని ఎత్తు ఏకంగా 1,092 అడుగులు. ఇది కమ్యూనికేషన్‌, అబ్జర్వేషన్‌ టవర్‌. సందర్శకులు వస్తుంటారు. 1958లో ఈఫిల్‌ టవర్‌ నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకుని కట్టారు. అయిదు సంవత్సరాలకోసారి రంగులతో ముస్తాబు చేస్తుంటారు.
టోక్యోలో 100కు పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలున్నాయి. అక్షరాస్యత 99 శాతం
అమరవీరుల స్మృతి చిహ్నంగా నిర్మించిన ‘‘యాసుకీమండపం’’విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. బౌద్ధ పుణ్యక్షేత్రాలు అక్కడక్కడా ఉన్నాయి. టోక్యోలోని జాతీయ క్రీడా స్టేడియంలో 72,000 వేల మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉంది.
టోక్యో నేషనల్ మ్యూజియం జపాన్ లోని మ్యూజియంలలో పెద్దది. నాటక ప్రక్రియలలో కబూకీ ప్రముఖమైనది. తేయాకు సేవించటంలో, బోన్సాయ్ (వామన-చిన్న చిన్న చెట్లు), ఓహారా అనే పుష్పాలతో అలంకరణ టోక్యో నగర ప్రత్యేకతలు.