ఆస్ట్రియా రాజధాని వియన్నా నగరం... ఈ మధ్య ప్రపంచ జీవనయోగ్య సూచీపై ఎకనామిస్ట్ పత్రిక జరిపిన సర్వేలో ఇదే అగ్ర స్థానంలో నిలిచింది... నగర విస్తీర్ణం: 414.65 చదరపు కిలోమీటర్లు. ఈ జనాభా 18 లక్షలు. ఆస్ట్రియా దేశంలో అతి పెద్ద నగరం. డాన్యూబ్ నది ఒడ్డున ఆస్ట్రియాలో తూర్పువైపున ఉంది. దేశ ఆర్థిక, రాజకీయ కేంద్రం ఈ నగరమే. ఈ నగరం ‘బెస్ట్ ప్లేస్ టూ లివ్’ ర్యాంకు సంపాదించుకుంది.
పచ్చదనంతో చుట్టూ కొండలతో కనువిందు చేసే ఈ నగరంలో కాలుష్యమూ తక్కువ. స్వచ్ఛమైన నీరు వియన్నా నగర ప్రత్యేకత. పర్వతాల నుంచి వచ్చే నీటి వనరులను ఇక్కడ ఉపయోగించుకుంటారు.
సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలున్నాయి. మెట్రో రైళ్ల్లు, ట్రాలీ బస్సులు, బస్సులు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి
వియన్నాలో ప్రముఖ సంగీత కళాకారులు ఎక్కువ. ఎంతో మంది కళాకారులకు నిలయమిది. ప్రదర్శనశాలలు, ఒపేరా హౌసులు, థియేటర్లు, ఫిల్మ్, డ్యాన్స్ ఫెస్టివల్స్ ఎక్కువే.
నగరంలో నేరాల రేటు చాలా తక్కువ. ఏటా కోటికిపైగా సందర్శకులు వస్తుంటారిక్కడకు. చిన్న చిన్న దొంగతనాలు తప్ప పెద్ద నేరాలు దాదాపుగా ఉండవు . అర్ధరాత్రుల్లో తిరగవచ్చు.
ఈ నగరంలోని జెయింట్ వీల్ ప్రపంచంలోని పురాతనమైన జెయింట్ వీల్ రైడ్లలో ఒకటి. దీన్ని 1897లో ఏర్పాటు చేశారు.
నగరంలోని ‘కేఫ్ సాచెర్’ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో 20 రకాల కాఫీ రుచుల్ని ఆస్వాదించవచ్చు.
1752లో ప్రారంభమైందీ జూ. ప్రపంచంలోని ప్రాచీన జంతుప్రదర్శనశాల ఇక్కడుంది.