మార్కోపోలో ఇటలీ(వెనిస్) దేశ యాత్రికుడు. 1271-1275 సంవత్సరాల మధ్య భూభాగాన్ని అనుసరించి బాగ్దాద్, గోబీ ఎడారి, షాంగ్ టూ ద్వారా చైనానుసందర్శించి, కుబ్లయ్ ఖాన్ దర్బారులో సంవత్సరాలు ఉన్నాడు.
మార్కోపోలో తెలివితేటలకు, ప్రజ్ఞకు మెచ్చి కుబ్లయ్ ఖాన్ మార్కోపోలోను కారకోరమ్, కొచ్చిన్, చైనా, బర్మా దేశాలకు తన రాయబారిగా పంపాడు. తరువాత మంగోల్ రాకుమారి వెంట సుమత్రా (ఈ నాటి ఇండోనేషియా) దక్షిణ భారతదేశాల మీదుగా సముద్రమార్గాన పర్షియా చేరి, రాకుమారి అక్కడ వదలి 1295 నాటికి ఇటలీ చేరుకున్నాడు మార్కోపోలో .
ఈ 24 సంవత్సరాలపాటు తను సందర్శించిన ప్రాంత విశేషాలను వ్రాసి పెట్టుకున్నాడు. స్వదేశంలో నౌకాధిపతిగా ఉండగా యుద్ధంలో శత్రువులు ఇతనిని బందీగా పట్టుకున్నారు. కారాగారంలో ఉన్న సమయంలోనే తన అనుభవాలు జ్ఞాపకాలను రస్టిసియానో అను వానికి చెప్పి గ్రంధస్థం చేయించి తన యాత్రా చరిత్రను ముందు తరాల వారికి అందచేసారు. .
ప్రాచ్య దేశ విశేష వైభవ సంపత్తులను గూర్చి పాశ్చాత్తులు తెలుసుకోవటానికి ఇతని డిస్క్రిప్షన్ ఆఫ్ ద వరల్డ్ అనే గ్రంథం చాలా ఉపయోగపడింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో బాపట్లలోని మోటుపల్లి రేవులో కాకతీయులు వేయించిన అభయశాసన ప్రస్తావన ఈ గ్రంథంలో కనబడుతుంది.
మార్కోపోలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద వరల్డ్ గ్రంథంఆధారంగానే యూరోపియన్ అన్వేషక బృందాలు తూర్పువైపు ప్రయాణించారు.