లింకన్ ప్రపంచ రాజనీతిజ్ఞులలో మరపురాని మహామనిషి. దేశాన్ని పరిపాలించడానికి ప్రజాస్వామ్యం ఒక్కటే మంచి మార్గమని అనుభం ద్వారా చాటిచెప్పిన మహావ్యక్తి.
ప్రపంచ ప్రజాస్వామ్యాలపై లింకన్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. 1861-65 అమెరికా పౌరయుద్ధ సమయంలో అమెరికన్ రాష్ట్రాల ఐక్యతకై పోరాటం జరిపిన మోధుడు.
లింకన్ రచనలలో గెటిన్ బర్గ్ ప్రసంగం అనేకమందిని ప్రభావితం చేసింది. లింకన్ కు గుండె నిబ్బరం మెండు. ఆత్మవిశ్వాసమే లింకన్ సొత్తు.
పిబ్రవరి 12, 1809సంవత్సరంలో కెంటకీలోని ఎలిజబెత్ టౌన్ సమీపంలోని హాడ్గెనలో జన్మించాడు. చిన్నప్పుడు బీదరికంలో కష్టాలు పడి వీధిబడిలాంటి పాఠశాలలోనే చదువుకున్నాడు. వీమ్ రచన వాషింగ్ టన్ జీవితచరిత్ర పట్ల ఆకర్షితుడై అనేకసార్లు చదివి స్పూర్తిని పొందాడు.
లింకన్ ఆజానుబాహుడు, మంచి వక్త, ధారాళంగా మాట్లాడగలడు. న్యూసెలమ్ లో వ్యక్తిగత జీవితం ప్రారంభించి ఐచ్ఛిక సైనికోద్యోగి అయ్యాడు. ఆ తరువాత 1832లో స్నేహితుల ప్రోద్భలంతో శాసనసభ్యకు అభ్యర్ధిగా నిలబడి ఓడిపోయాడు. తరువాత 1834 సం.లో విజయం సాధించాడు. న్యాయశాస్త్రం చదివి న్యాయవాదియై 1840లో జాతీయ రాజకీయ రంగంలో ప్రవేశించాడు.
కాంగ్రెస్ సభ్యుడయ్యాడు. మరలా న్యాయవాద వృత్తిని చేపట్టి మరింత పలుకుబడిని సంపాదించుకున్నాడు. 1858 సం.లో సెనెట్ సభ్యుడయ్యాడు. 1861 సం.లో అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు. అదే సంవత్సరంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య యుద్ధం ప్రారంభమైనది, 1862 సం.లో బానిస జనోద్ధారణకు ప్రాధమిక ప్రకటన చేసాడు. 1863లో దీనిని బలపరచి మరలా ప్రకటన చేసాడు. 1864 సం.లో మరలా అధ్యక్షునిగా ఎన్నకోబడ్డాడు. 1865 సం.లో అంతర్యద్ధం ముగిసింది.
నీగ్రోలకు, తెల్లవారికి ఒకే విధమైన రాజ్యాంగం ఉండాలని లింకన్ పట్టుదల. వ్యత్యాస భావం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లింకన్ అభిప్రాయం.
లింకన్ అధశ్యక్షుడిగా ఉండగా మొదటిసారిగా 1861 సంవత్సరంలో కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టబడ్డాయి. 1862సం.లో బంజరు భూములకు పట్టాలిచ్చే హోమ్ స్టీడ్ చట్టం ప్రవేశపెట్టబడింది. 1863లో నీగ్రో బానిస జన ఉద్దరణ ప్రకటన ఈయన జీవితంలో ప్రధాన ఘట్టాలు. దీనితో లింకన్ పేరు చిరస్థాయిగా నిలచిపోయింది. సౌత్ డకోటాలోని రష్ మోర్ పర్వత ప్రాంతంలో ఉన్న ఒక జాతీయ స్మారక ప్రాంగణ శిఖరాగ్రం మీద వాషింగ్ టన్, జెఫర్సన్, రూజ్ వెల్ట్ తో పాటు లింకన్ శిలావిగ్రహాన్ని చెక్కించి అమెరికన్ ప్రజల నివాళులు అర్పించారు. వాషింగ్ టన్ లోని లింకన్ మెమోరియల్ చూడదగ్గది.
రాజధాని వాషింగ్ టన్ డి.సిలో ఒక నాటక ప్రదర్శనను చూస్తుండగా బూత్ అనేవాడు వెనుకనుండి తుపాకీతో కాల్చగా అమరుడయ్యాడు.