header

బొబ్బర్లు (అలసందలు) / Bobbarlu (alasandalu)

బొబ్బర్లు (అలసందలు) / Bobbarlu (alasandalu)

రోజువారీ ఆహారంలో బొబ్బర్ల వాడకం తక్కువే. కానీ, వీటిల్లో ప్రొటీన్ శాతం చాలా ఎక్కువ. అందుకే దీన్ని ‘పేదవాడి మాంసాహారం’ అని పిలుస్తారు. ఇంకా ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లతోబాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం, సోడియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్... వంటి ఖనిజాల శాతమూ ఎక్కువే. -- బొబ్బర్లలోని ప్రొటీన్లు నెమ్మదిగా జీర్ణం కావడంతో ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా వూబకాయులకి ఇది మంచి ఆహారం. ఫోలిక్ ఆమ్లం కూడా ఎక్కువగా ఉండటంతో గర్భిణీలు వీటిని తీసుకుంటే నాడీసంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులోని ఫ్లేవనాయిడ్లతోబాటు విటమిన్ బి1 హృద్రోగాల నివారణకు దోహదపడుతుంది. బొబ్బర్లలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకు సాయపడతాయి. --వీటిల్లో ట్రిప్టోఫాన్ శాతం అధికంగా ఉండటంతో మంచి నిద్రపడుతుంది. అందుకే నిద్రలేమి, విశ్రాంతి లేకపోవడం... వంటి సమస్యలతో బాధపడుతుంటే నిద్రకు ముందు వీటిని సలాడ్ రూపంలో తీసుకుంటే మంచిది. --బొబ్బర్లలో ఎక్కువగా ఉండే మెగ్నీషియం జీవక్రియను మెరుగుపరిచేందుకూ తద్వారా చక్కెరవ్యాధి నియంత్రణకీ కారణమవుతుంది. అంతేకాదు, వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించేందుకూ దోహదపడతాయి. --బొబ్బర్లలోని ఎ, సి విటమిన్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ను తొలగించడం ద్వారా క్యాన్సర్ కణాలను పెరగనీయకుండా అడ్డుకుంటాయి. ఇవి క్లోమగ్రంథి సమస్యలతోబాటు మూత్ర సంబంధిత సమస్యలున్న వాళ్లకీ ఎంతో మేలు.