header

Fox Tail Millet, Fox Tail Millet, Kodo Millets, Little Millets, Fox Tail Millets, Finger Millet

Sorghum - జొన్నలు

ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని పలు దేశాల్లో జొన్నలు విరివిగా పండుతాయి. గ్లూటెన్‌ రహిత చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. జొన్న రొట్టెలు, జొన్న అంబలి వంటివి మన దేశంలో విరివిగా వాడుకలో ఉన్నాయి. విదేశాల్లో బ్రెడ్, బిస్కట్లు వంటి వాటి తయారీలో జొన్నలను ఎక్కువగా వాడతారు. గ్లూటెన్‌ సరిపడని వారికి జొన్నలు కూడా మంచి ప్రత్యామ్నాయం.జొన్నలలో రెండు రకాలున్నవి. పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. పచ్చ జొన్నలు చిరిచేదుగా ఉండి ఆరోగ్యానికి మంచివంటారు. తెల్లజొన్నలు కొద్దిగా తియ్యదనం కలిగి ఉంటాయి. జొన్న రవ్వతో ఇడ్లీలు, ఉప్మా చేసుకోవచ్చు. జొన్నపిండితో రొట్టెలు తయారు చేసుకుంటారు. తెలంగాణా, కర్నూలు ప్రాంతాలలో వీటి వాడకం ఎక్కువ.
పోషకాలు: జొన్నల్లో పిండి పదార్థాలు, చక్కెరలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్‌ బి1, బి2, బి3, బి5 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటంతో జొన్నలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. శరీరంలో చెడుకొవ్వును నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని, ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీవకణాలకు పునరుత్తేజం కలిగిస్తాయి. జుట్టురాలడాన్ని నియంత్రిస్తాయి.
Finger Millet - రాగులు
ఆఫ్రికా దేశాల్లోనూ, భారత్‌ సహా పలు ఆసియా దేశాల్లోనూ విరివిగా వాడే చిరుధాన్యం రాగులు. చౌకగా దొరికే చిరుధాన్యాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి రాగులే. రాగి ముద్ద, రాగిజావ, రాగి రొట్టెలు మన దేశంలోని చాలా ప్రాంతాల్లో నేటికీ వినియోగంలో ఉన్నాయి. నెమ్మదిగా జీర్ణమయ్యే రాగులు త్వరగా నీరసించిపోకుండా చూస్తాయి. మధుమేహ రోగులకు ఇవి మంచివి
పోషకాలు: రాగుల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, నామమాత్రంగా కొవ్వులతో పాటు విటమిన్‌ బి1, బి2, బి,3 బి5, బి6, బి9 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్‌ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: రాగులు స్థూలకాయాన్ని దూరం చేస్తాయి. గోధుమల్లోని గ్లూటెన్‌ సరిపడని వారికి రాగులు సరైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఎముకలకు దారుఢ్యం ఇవ్వడంతో పాటు రక్తహీనతను దూరం చేస్తాయి.
Pearl Millet – సజ్జలు
భారత ఉపఖండం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్‌ వంటి ప్రాంతాల్లో విరివిగా వాడుకలో ఉండే చిరుధాన్యం సజ్జలు. సజ్జల ఉత్పాదనలో భారత్‌దే అగ్రస్థానం. సజ్జ రొట్టెలు, సజ్జ అంబలి వంటివి మన దేశంలో విరివిగా వాడుకలో ఉండగా, విదేశాల్లో బ్రెడ్, కేకులు, బిస్కట్లు వంటి పదార్థాల తయారీలో సజ్జలను వాడతారు. గ్లూటెన్‌ కారణంగా గోధుమలు సరిపడని వారికి సజ్జలు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో కండరాలకు మంచి శక్తినిస్తాయి.
పోషకాలు: సజ్జల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు స్వల్పంగా కొవ్వులు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: సజ్జలు రోగనిరోధక శక్తిని, కండర బలాన్ని మెరుగుపరుస్తాయి. రక్తహీనతను అరికడతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. టైప్‌–2 డయాబెటిస్‌ ముప్పును గణనీయంగా నివారిస్తాయి. అంతేకాకుండా, ఆహారంలో సజ్జలను తరచుగా తీసుకుంటున్నట్లయితే గాల్‌స్టోన్స్‌ ఏర్పడకుండా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది.
Fox Tail Millet కొర్రలు
భారత్, చైనా సహా పలు ఆసియా దేశాల్లో విరివిగా పండించే చిరు ధాన్యాలు కొర్రలు. వీటిని ఉత్తర అమెరికా, యూరోప్‌లనూ పండిస్తారు. దక్షిణ భారత దేశంలో ఉపయోగించే చిరుధాన్యాల్లో కొర్రలు నేటికీ ప్రధానంగానే ఉంటూ వస్తున్నాయి. కొర్రన్నం, కొర్ర అంబలి వంటి వంటకాలు మన దేశ ప్రజలకు అలవాటైనవే. చైనా సహా పలు దేశాల్లో వీటిని పాస్తా, నూడుల్స్‌ వంటి వాటి తయారీలోనూ వాడతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివంటారు.
పోషకాలు: కొర్రల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. స్వల్పంగా కొవ్వులు ఉంటాయి. విటమిన్‌ బి1, బి2, బి5, బి6, విటమిన్‌ ఇ వంటి విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్‌; మాంగనీస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: తక్షణ శక్తినిస్తాయి. రక్తంలో చక్కెర పరిమాణాన్ని, స్థూలకాయాన్ని నియంత్రిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని జీవక్రియలను, జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి.
Little Millet- సామలు
భారత ఉపఖండ ప్రాంతంలో సామలు చిరకాలంగా సాగవుతున్నాయి. సామల దిగుబడిలో భారత్‌దే అగ్రస్థానం. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ సామలను విరివిగానే వినియోగిస్తున్నారు. సామలను నేరుగా ఉడికించుకుని అన్నంలా వండుకోవడంతో పాటు సామల జావ, సామల పిండితో రొట్టెలు వంటి వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. ఇతర చిరుధాన్యాల్లాగానే ఇవి కూడా తక్షణ శక్తినిస్తాయి. తేలికగా అరుగుతాయి.
పోషకాలు: సామల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి. స్థూలకాయం, టైప్‌–2 డయాబెటిస్‌ రాకుండా చూస్తాయి. రక్తహీనతను దరిచేరనివ్వవు. గుండెజబ్బులు, ఉబ్బసం వంటి వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి.
Kodo Millet - అరికెలు
భారతదేశంలో విరివిగా వినియోగించే చిరుధాన్యాల్లో అరికెలు కూడా ముఖ్యమైనవి. పశ్చిమ ఆఫ్రికా దేశాలోనూ, వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ వంటి ఆసియన్‌ దేశాల్లోనూ అరికెలను పండిస్తారు. అరికెలను అన్నంలా వండుకుని తినడంతో పాటు వీటితో రొట్టెలు, జావ వంటివి కూడా తయారు చేసుకుంటారు. మిగిలిన చిరుధాన్యాల మాదిరిగానే అరికెలు కూడా తక్షణ శక్తినిస్తాయి. నెమ్మదిగా జీర్ణం కావడంతో త్వరగా ఆకలి కానివ్వవు.పోషకాలు: అరికెల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: తక్షణ శక్తినిస్తాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తహీనతను నివారిస్తాయి. మధుమేహం, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి.