header

Finger millets….రాగులు ప్రయోజనాలు

Finger millets….రాగులు ప్రయోజనాలు

రాగుల్లో క్యాల్షియం, ఐరన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్‌, పీచుతో పాటు ఖనిజాలు కూడా ఎక్కువే. కొవ్వుశాతం కూడా తక్కువ. మధుమేహులకు, ఊబకాయులకైతే రాగులు వరదాయిని అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. రాగుల్లో మన శరీరానికి అవసరమై ట్రిప్టోథాన్‌, వాలైన్‌, మెథియోనైన్‌ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. వందగ్రాముల రాగిపిండిని తింటే ఆరోజుకి మన అవసరమై 350 మి.గ్రా క్యాల్షియం లభించినట్లే. అలాగే ఐరన్‌ 3.9 మి.గ్రా నిసిన్‌ 1.1. మి.గ్రా. థయామిన్‌ 0.42 మి.గ్రా. రైబోఫ్లావిన్‌ 0.19 మి.గ్రా అందుతాయి.
అధిక బరువు తగ్గటానికి : రాగుల్లోని ట్రిప్టోథాన్‌ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి అదనంగా శరీరంలో కేలరీలు పోగుపడకుండా చూస్తాయి. వీటిల్లోని పీచు కడుపు నిండిన భావన కలిగించి, ఎక్కువగా తినకుండా చేస్తాయి. ఇవన్నీ బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
ఎముక పుష్టికి : వీటిల్లో క్యాల్షియం దండిగా ఉండటం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధులలో ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. ఎముకల క్షీణతను నివారించి రక్తంలో గ్లూకోజు స్థాయిలలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతాయి.
కొలస్ట్రాల్‌ తగ్గేందుకు : లెసిథిన్‌, మెథియోనైన్‌ అనే అమైనో ఆమ్లాలు కాలేయంలో పోగుపడిన కొవ్వును నిర్మూలిస్తుంది. ఇక థ్రియోనైన్‌ అమైనో ఆమ్లం కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది.
రక్తహీనత : రాగుల్లోని ఐరన్‌ రక్తహీనత తగ్గటానికి దోహదం చేస్తుంది.
కండరాల మరమ్మత్తుకు : ఐసోల్యూసిన్‌ అమైనో ఆమ్లం కండరాల మరమ్మత్తుకు, రక్తం ఉత్పత్తికి, ఎముకలు ఏర్పడటానికి, చర్మం ఆరోగ్యం మెరుగు పరచటానికి దోహదం చేస్తుంది. వాలైన్‌ అమినో ఆమ్లం జీవక్రియ సరిగా జరగటంలో పాలుపంచుకుంఉటంది. కండరాల సమన్వయంతో పనిచేయటానికి, శరీరంలో నైట్రోజన్‌ సమతుల్యతకు తోడ్పడుతుంది.
వృద్ధాప్యం దూరంగా : రాగులను క్రమం తప్పకుండా తింటే పోషణలోపాన్ని దూరంగా ఉంచవచ్చు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో పాటు త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండానూ చూసుకోవచ్చు.
ఆందోళన : రాగులలోని ట్రిప్టోథాన్‌ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువలన ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు తోడ్పడతాయి. కొన్నిరకాల పార్శ్యనొప్పులు తగ్గటానికి ఉపయోగపడుతుంది.