header

Non Veg Food / చికెన్‌, మటన్, పీతలు, రొయ్యలు, చేపలు

Non Veg Food / చికెన్‌, మటన్, పీతలు, రొయ్యలు, చేపలు

కోడిమాంసం - చికెన్‌
ప్రపంచవ్యాప్తంగా చికెన్‌ ప్రధాన మాంసాహారం . ఇందులో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల డాక్టర్లు కూడా దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిదనే సూచిస్తుంటారు. కోడిమాంసం మంచి పౌష్టికాహారం. మాంసాహారం తినే వాళ్లలో చాలామంది కోడిమాంసాన్ని బాగా ఇష్టపడతారు. కోడిమాంసం కొనేటపుడు జాగ్రత్తగా చూసి కొనాలి. కొవ్వు (మాంసంపై తెల్లని పొరలాగా ఉంటుంది) ఎక్కువగా ఉండకూడదు. కోడిమాంసం ముదురు రంగులో కాకుండా లేత గులాబీ రంగులో ఉండాలి. నిల్వఉన్న మాంసాన్ని కల్తీ చేస్తారు. తాజాకూర చెడు వాసన లేకుండా చూసి కొనాలి. స్కిన్ తో ఉన్న మాంసం కంటే స్కిన్ లేని మాంసంలో కొవ్వు తక్కువుగా ఉంటుంది.
పోషకాలు: కోడి మాంసంలో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్‌–ఎ, బి5 వంటి విటమిన్లు, ఐరన్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: కోడిమాంసంలోని ప్రొటీన్లు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. బరువు తగ్గాలని డైట్‌ పాటించే వారికి చికెన్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
వేటమాంసం - మటన్‌
మేక, గొర్రె మాంసాలను వేటమాంసంగా పరిగణిస్తారు. మేక మాంసాన్ని తక్కువ వేడిలో వండితే ఆరోగ్యానికి మంచిది. మేక, గొర్రెల మెదడు, కాలేయాన్ని కూడా తింటారు. వాటి తల మాంసాన్ని చాలామంది ఇష్టపడతారు. ఆంధ్రాప్రాంతంలో వేట మాంసం (పొటేలు మాంసం) ను ఎక్కువగా ఇష్టపడతారు. వేటమాంసం కొనేటపుడు చూసి జాగ్రత్తగా కొనాలి. లేత గులాబీ రంగులో ఉన్న మాంసం లేతగా ఉంటుంది. ముదురు రంగు మాంసం అయితే ముదిరిపోయి తొందరగా ఉడకదు, అరుగుదల తక్కువ. అంతే కాకుండా వేటమాంసంలో కల్తీ ఎక్కువగా జరుగుతుంటుంది. దీనిలో వేరే పక్కన ఉన్న ముక్కలు వేయకుండా జాగ్రత్తపడాలి. శనివారం కబేళాలకు సెలవు. కనుక ఆరోజు తాజావేటమాంసం లభించదు. కనుక శనివారం వేటమాంసం తినకపోవటం మంచిది. డయాబెటిక్ వారు వేటమాంసం తినకపోవటం మంచిదంటారు.
పోషకాలు: ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్‌– బి6, బి12 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: వేటమాంసం రక్తహీనతను అరికడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీ మహిళలు వేటమాంసాన్ని తింటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు. వేటమాంసం ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
పీతలు
పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోనూ ఉంటాయి. వీటిని అన్ని దేశాల్లోనూ తింటారు. పీతలతో రకరకాల వంటకాలు చేసుకుంటారు.
పోషకాలు: పీతల్లో ప్రొటీన్లు, కొవ్వులు, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్‌–సి, బి6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: మధుమేహ రోగుల ఆరోగ్యానికి పీతలు మేలు చేస్తాయి. దంతాలు, ఎముకలకు దారుఢ్యాన్నిస్తాయి. నాడీ వ్యవస్థకు, గుండెకు బలాన్నిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి.
చేపలు
ప్రపంచవ్యాప్తంగా చేపలను విరివిగా తింటారు. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. మన దేశంలో చేపల పులుసు, చేపల వేపుడు లాంటివి చేస్తుంటారు. చేపల్లో సముద్రపు చేపలు, మంచినీటి చేపలు పలు రకాలు ఉంటాయి. చేపలను ఎండబెట్టి నిల్వ చేసుకుని కూడా వండుకుంటారు. చేపలను కొనేటపుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. తాజా చేపలనే కొనాలి. చేప పైభాగంలో వేలితో నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి. సొట్ట పడకూడదు. చేపలు గట్టిగా కనపడటానికి ఐస్ లో నిలవ ఉంచుతారు. చేప మొప్పలు ఎత్తి చూస్తే మంచి ఎర్ర రంగులో ఉండాలి. పాలిపోయి ఉండకూడదు.తాజా చేపల కళ్లు కూడా ప్రకాశవంతంగా ఉంటాయి. పాలిపోయి ఉండవు. చేపల నుండి దుర్వాసన రాకూడదు. డయాబెటిక్ వారికే కాకుండా అందరికీ మటన్, చికన్ కంటే చేపలు ఆరోగ్యకరమని వైద్యులు చెబుతారు.
పోషకాలు: చేపల్లో ప్రొటీన్లు, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్‌–ఎ, విటమిన్‌–డి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, ఫాస్ఫరస్, సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: చేపల్లో లభించే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. చేపలు మెదడుకు మేలు చేస్తాయి. పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యానికి కూడా చేపలు ఉపయోగపడతాయి. మధుమేహంతో బాధపడే వారు తరచు చేపలను తినడం ఎంతో మంచిది.
కోడి గుడ్డు
రోజుకో ఉడికించిన గుడ్డును తినాలంటారు డాక్టర్లు. మనకు కావలసిన అన్ని రకాల పోషకాలు ఈ గుడ్డులో ఉండటం విశేషం. ఉడికించిన గుడ్డును తినడం ఇష్టంలేని వారు బ్రెడ్‌ ఆమ్లేట్‌ లేదా గుడ్డుతో చేసే ఏ వంటకాలు తిన్నా, అన్ని పోషకాలు సమంగానే అందుతాయి.
పోషకాలు: గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్‌ ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12, విటమిన్‌–డి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: గుడ్డు కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. గుండెజబ్బులను దూరంగా ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలను నివారిస్తుంది.
రొయ్యలు
ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ రకరకాల రొయ్యలను ఆహారంగా తీసుకుంటారు. అన్ని రకాల రొయ్యల్లోనూ దాదాపు అవే పోషకాలు ఉంటాయి. వీటిని వివిధ రకాలుగా వండుతారు. సముద్రంలోని రొయ్యలే కాకుండా... వీటిని ప్రత్యేకమైన చెరువుల్లోనూ పెంచుతారు. పచ్చి రొయ్యలతో పాటు ఎండు రొయ్యలను కూడా తింటారు. తాజా రొయ్యలను చూసి కొనాలి. నిల్వ ఉన్నవాటిని తినరాదు. మార్కెట్ లలో సాయంత్రం పూట తాజా రొయ్యలు, చేపలు దొరకవు.
పోషకాలు: రొయ్యల్లో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఉంటాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: రొయ్యలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. దంతాలకు, ఎముకలకు మేలు చేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్లకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి.