header

Basil seeds…సబ్జా గింజలు..

Basil seeds…సబ్జా గింజలు..
వేసవిలో మన ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా గింజలు చాలా మేలు.
ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి
సబ్జా గింజల పానీయం గుప్పెడు సబ్జా గింజలను తీసుకొని శుభ్రం చేసుకొని గోరువెచ్చని నీళ్లు పోసి గంటపాటు నానబెట్టాలి. నీటిలో నానిన నల్లని గింజలు జెల్లీలా మారిపోతాయి. ఇప్పుడు ఈ సబ్జా గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకుని తాగొచ్చు, లేదంటే పంచదార కలిపిన నీటిలో వేసుకుని తీసుకోవచ్చు.
మలబద్ధానికి విరుగుడు
సబ్జా గింజల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు. రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల పానీయం తాగితే మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలైన కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
బరువు తగ్గడానికి .....
ఊబకాయంతో బాధపడే చాలా మందికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాలా పనిచేస్తుంది. ఆహారం తీసుకునే ముందు గ్లాసుడు సబ్జా గింజల పానీయం తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల తక్కువగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇది డైటింగ్ చేసే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. సబ్జా గింజల నుంచి అందే కేలరీలు కూడా చాలా తక్కువే.
మధుమేహం ......
చక్కెర వేయకుండా అలాగే సబ్జా గింజల నీటిని తాగితే మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు పచ్చిపాలలో వేసుకొని, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్2 మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది.
సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం.