పొద్దుతిరుగుడు గింజలను అలాగే కానీ కొద్దిగా వేపుకుని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్-ఇ, థైమీన్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం... వంటి అరుదైన విటమిన్లూ ఖనిజాలూ ఉంటాయంటున్నారు. వీటిల్లో ఫ్యాటీ ఆమ్లాలూ పీచూ అమైనోఆమ్లాలూ ఇతరత్రా బి-విటమిన్లూ, ఫైటోస్టెరాల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
ఈ గింజలు అనేక వ్యాధుల్ని నిరోధిస్తాయి. ఇందులోని ఫ్యాటీఆమ్లాలు ఎ, డి, ఇ, కె విటమిన్ల శోషణకు దోహదపడతాయి. ఇందులోని విటమిన్-ఇ అద్భుతమైన యాంటీఆక్సిడెంటులా పనిచేస్తుంది.
పొద్దుతిరుగుడు గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా హానికర ఫ్రీరాడికల్స్ విడుదలను అడ్డుకుంటాయి. దాంతో క్యాన్సర్లూ హృద్రోగాలూ వంటివి రాకుండా ఉంటాయి.
వీటిల్లోని సెలీనియం థైరాయిడ్ వ్యాధుల్నీ అడ్డుకుంటుందంటారు నిపుణులు.
పొద్దుతిరుగుడు గింజల్లోని మెగ్నీషియం బీపీని నియంత్రించడంతోబాటు, తలనొప్పి, మలబద్ధకం, అలసట, డిప్రెషన్, ఆందోళన... వంటి వాటిని తగ్గించడానికీ దోహదపడుతుంది.
వీటిల్లో పాంటోథెనిక్ ఆమ్లం శాతం ఎక్కువ. ఇది జీవక్రియా వేగానికీ హర్మోన్ల సమతౌల్యానికీ మెదడు పనితీరుకీ తోడ్పడుతుంది. పైగా ఈ గింజలు ఇన్సులిన్ నిరోధానికి సాయపడుతూ మధుమేహం రాకుండా అడ్డుకుంటాయి. చర్మఆరోగ్యానికి, శిరోజాల పెరుగుదలకీ తోడ్పడతాయి. అందుకే వీటిని సలాడ్లూ కూరలూ బ్రెడ్డూ కేకుల్లో చల్లుకోవడం లేదా విడిగా కాస్త వేయించుకుని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు లేదా ఈ పొడిని కేకులూ చపాతీలలో కొద్దిగా కలుపుకోవచ్చు.