చెమ్మచెక్క – చారడేసి మొగ్గ
అట్లు పోయంగ – ఆరగించంగ
ముత్యాల చెమ్మచెక్క – ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మచెక్క – రంగులెయ్యంగ
పగడాల చెమ్మచెక్క – పందిరెయ్యంగ
పందిట్లో మా బావ – పెళ్లిచెయ్యంగ
సుబ్బారాయిడి పెండ్లి – చూచివద్దాం రండి
మా వాళ్లింట్లో పెండ్లి – మళ్లీ వద్దాం రండి
ఒప్పుల కుప్పా – ఒయ్యారి భామ
సన్న బియ్యం – చాయపప్పు
బావిలో కప్ప – చేతిలో చిప్పా...
రోట్లో తవుడు – నీ మొగుడెవరు ?
గూట్లో రూపాయ్ – నీ మొగుడు సిపాయ్
దాగుడుమూతా దండాకోర్
పిల్లి వచ్చే ఎలుకా దాగే
ఎక్కడి దొంగలు అక్కడే
గప్ చిప్ పన్నీర్ బుడ్డి
చిక్ చిక్ రైలు వస్తుంది
దూరం దూరం జరగండి
స్టేషన్ లోన ఆగింది
ఆగిన రైలు ఎక్కండి
పచ్చలైటు చూసింది
కూతవేసి కదిలింది
జోజో పాపాయి ఏడవకు
బొమ్మలు ఎన్నో కొనిపెడతా
లడ్డు మిఠాయి తినిపిస్తా
కమ్మని కాఫీ తాగిస్తా
చందమామ రావే – జాబిల్లి రావే
కొండెక్కి రావే – గోగుపూలు తేవే
బండెక్కి రావే – బంతిపూలు తేవే
తేరుమీద రావే – తేనెపట్టు తేవే
పల్లకిలో రావే – పాలుపెరుగు తేవే
ఆడుకుంటూ రావే – అరటిపండు తేవే
అన్నింటినీ తేవే – మా అబ్బాయికియ్యవే
బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్తకోక కట్టనన్నది
మామతెచ్చిన మల్లెమొగ్గ ముడవనన్నది
మొగుని చేత మొట్టికాయ తింటానన్నది
బావా బావా పన్నీరు – బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు – వీసెడు గంధం పూసేరు
చావిడి గుంజకు కట్టేరు – చప్పిడి గుద్దులు గుద్దేరు
కాళ్లపీట వేసేరు – కడుపులో గుద్దులు గుద్దేరు
పట్టెమంచం వేసేరు – పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు – నూరు గుద్దులు గుద్దేరు
వానా వానా వల్లప్ప
వాకిట తిరుగు చెల్లప్పా
వానావానా వల్లప్ప
చేతులు చాచు చెల్లప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా
తిరుగలేను నరసప్పా
కాళ్లాగజ్జ - కంకాళమ్మ
వేగుల చుక్కా – వెలగా మొగ్గ
మొగ్గాకాదు – మోదుగ నీరు
నీరు కాదు – నిమ్మలబావి
బావికాదు – బచ్చలికూర
కూరకాదు – గుమ్మడిపండు
పండూ కాదు – పాపాయి కాలు
కాలు తీసి – కడగా పెట్టు