బాలీవుడ్ లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న అమితాబ్ అనేక రంగాలలో ప్రవీణుడు..సినిమా రంగంలో హీరోగా, టెలివిజన్ వ్యాఖ్యాత, నిర్మాత మరియు గాయకుడు కూడా. భారతదేశ అత్యున్న పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న నటుడు.
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును కూడా 2019లో పొందాడు.
1942 సం. అక్టోబర్ 11న అలహాబాద్ లో జన్మించాడు. ఇతని తండ్రి ప్రఖ్యాత హిందీ కవి హరివంశ్ రాయ్. తల్లి తేజా బచ్చన్ సిక్కు మతానికి చెందినది. వీరి కుటుంబం మొత్తం సీనీ రంగానికి చెందినదే. భార్య జయాబచ్చన్ ఒకప్పటి హిందీ సినిమాల నటి. కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా హిందీ సినిమాల నటుడు. కోడలు మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ విజయవంతమైన హిందీ సినిమాల హీరోయిన్. కొన్ని తెలుగు తమిళ సినిమాలలో కూడా నటించింది.
సాత్ హిందూస్తానీ సినిమాతో హిందీ సినిమాలలో ప్రవేశించాడు. ఇతని రెండవ సినిమా ఆనంద్ ఇందులో డాక్టర్ గా నటించి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. జంజిర్, దీవార్ సినిమాలలో యాంగ్రీ యంగ్ మెన్ నటించి దేశవ్యాప్తంగా పేరుపొందాడు. ఈ సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించి అమితాబ్ ను హీరోగా నిలబెట్టాయి. 1975లో విడుదలైన దీవార్, షోలే చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో మైలు రాళ్లుగా నిలిచాయి.
నాలుగు దశాబ్ధాల పాటు అమితాబ్ హిందీ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. బిగ్ బి, షెహన్ షా స్టార్ ఆఫ్ ది మిలీనియంగా మరియు అత్యంత ప్రతిభావంతమైన నటుడిగా పేరుపొందాడు. 15 ఫిలిం ఫేర్ అవార్డులు పొందాడు.
తరువాత కభీ కభీ సినిమాలో రోమాంటిక్ హీరోగా నటించాడు.అదాలత్ లో తండ్రీ, కొడుకులుగా నటించాడు.
1977 లో ఇతను నటించిన అమర్ అక్బర్ ఆంధోనీ గొప్ప విజయాన్ని సాధించింది. తరువాత మిస్టర్ నట్యర్ లాల్, కాలాపత్తర్, దోస్తానా,సిల్ సిలా మొదలగు విజయవంతమైన సినిమాలలో నటించాడు.
1982 సంలో కూలీ సినిమాలో నటిస్తూ పేగుకు గాయమై హాస్పటల్ లో చేరాడు. ఈ సమయంలో అమితాబ్ కోలుకోవాలని అమితాబ్ అభిమానులంతా దేవాలయాలలో పూజలు చేశారు. హాస్పటల్ వద్ద ఇతనిని చూడటానికి క్యూలలో వేచి ఉన్నారు.
1984లో రాజకీయాలలో ప్రవేశించాడు కానీ రాజకీయలలో ఇమడలేక బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. 1982-92 మధ్యలో అమితాబ్ నటించిన సినిమాలు అపజయం పాలవటం వలన దాదాపు 5 సం.లపాటు సీనీ రంగానికి దూరంగా ఉన్నాడు.
1996-99 సం.లమధ్య అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ అనే సీని నిర్మాణ సంస్థను స్థాపించి నష్టాల పాలైయ్యాడు.
2000 సం.లో తిరిగి సినిమాలలో నటించి విజయం సాధించాడు. మొహబ్బతే, కభీ ఖుష్ కభీ గమ్, బగ్నాన్, ఆంఖే, దేవ్ మొదలగు సినిమాలు విజయవంతమైనాయి.
కౌన్ బనేగా కరోడ్ పతి టి.వీ షోకు యాంకర్ గా పని చేసాడు. ఈ షో టెలివిజన్ రంగంలో గొప్పగా హిట్ అయుంది.
తెలుగులో యన్.టి.రామారావు, హిందీలో అమితాబ్ బచ్చన్ లాగే పేరు పొందిన నటులు ఎవరూ లేరనటం అతిశయోక్తి కాదేమో.