పద్మనాభంగా తెలుగు సినిమా రంగంలో పేరుపొందిన ఇతని అసలు పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1931 ఆగస్టు 20వ తేదీన కడపజిల్లా, పులివెందులలోని సింహాద్రిపురంలో జన్మించాడు. ఇతను హాస్యనటుడు. కొన్ని సినిమాలకు నిర్మాత మరియు దర్శకుడు కూడా. చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూ వాటిలోని పద్యాలు, పాటలు పాడుతూ ఉండేవాడు. 10 సంవత్సరాల వయస్సులోనే చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసాడు.
ప్రొద్దుటూరిలో వారాలు చేసుకుని చదుకున్నాడు కానీ చదువు వంటబట్టలేదు. మద్రాసు చేరి కన్నాంబను తన గానకళతో మొప్పించి వారి రాజరాజేశ్వరీ కంపెనీలో చేరాడు. సినిమాలలో నటిస్తూనే 60 నాటకాల దాకా వేసాడు. ఋష్యంద్రమణి ట్రూపులో చేరి పాదుకా పట్టాభిషేకం, సతీసక్కుబాయి,హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ నాటకాలలో వేషాలు వేసాడు.
మాయాలోకం సినిమాలో ఒక చిన్న పాత్రవేసి కోరస్ గ్రూపులో పాటపాడాడు. తరువాత త్యాగయ్య, ముగ్గురు మరాఠీలు, యోగి వేమన సినిమాలలో నటించాడు. తరువాత పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి శిష్యుడు సదాజపుడిగా నటించి మొప్పు పొందాడు. తరువాత పెళ్లిచేసిచూడు, చంద్రహారం సినిమాలలో నటించాడు.తరువాత వరుసగా సతీ అనసూయ, కృష్ణప్రేమ,శ్రీకృష్ణలీలలు, సతీ తులసి, ప్రమీలార్జనీయం సినిమాలలో నటించాడు.
తరువాత మురళీ ఆర్ట్స్ పేరిట సొంత నిర్మాణ సంస్థ స్థాపించి దేవత, పొట్టిప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాలు నిర్మించాడు. మర్యాద రామన్న సినిమాతో యస్.పి. బాలసుబ్రహ్మణ్యం తొలిసారి గాయకుడిగా పరిచయమయ్యాడు. 1968 లో శ్రీరామకథ సినిమాను నిర్మించి దర్శకత్వం కూడా వహించాడు.
1970లో కథానాయక మొల్ల సినిమాతీసి బంగారు నంది అవార్డు పొందాడు. దాదాపు 400 చిత్రాలలో నటించిన పద్మనాభం హాస్యం సున్నితంగా వైవిధ్యభరితంగా ఉంటుంది.
యోగాసనాలు వేసే ఇతను78 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవించి 2010 ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం గుండెపోటుతో చెన్నైలో మరణించాడు.