తెలుగు సీనీ రంగంలో రమణారెడ్డి, రేలంగి తరువాత తిరుగులేని హాస్యనటుడిగా పేరుతెచ్చుకున్న రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పల రాజు. ఇతను1935 అక్టోబర్ 20 తేదీన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించాడు. పన్నెండవ తరగతి దాకా చదువుకున్నాడు. చదువుకునే రోజులలలో నాటకాలు వేసేవాడు. సినిమాల మీద ఆసక్తితో మద్రాసు వెళ్లాడు.
మొదట సమాజం అనే సినిమాలో నటించాడు. తరువాత కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూనే నాటకాలు కూడా వేసేవాడు. తరువాత అంతస్తులు సినిమాలో నటించి నటునిగా గుర్తింపు పొందాడు. అప్పటి నుండి వరుస సినిమాలే. ఆకాశరామన్న, సతీ శబరి, ప్రచండ భైరవి, సత్యహరిశ్చంద్ర సినిమాలలో నటించి నటుడిగా స్థిరపడ్డాడు. హాస్యనటులు మీనాకుమారి, గీతాంజలిలతో అనేక సినిమాలలో నటించాడు. కానీ అప్పట్లో రాజబాబు, రమాప్రభ జంట హాస్య జంటగా పేరుపొందింది.
ఎవరికివారే యమునాతీరే, మనిషి రోడ్డున పడ్డాడు సినిమాలను స్వయంగా నిర్మించి తానే హీరోగా నటించాడు. తాతా మనవడు సీనిమాలో కూడా ఇతనే హీరో. తన హాస్యనటనా చాతుర్యంతో ప్రేక్షకులను ధియేటర్ కు రప్పించగల సమర్ధుడు రాజబాబు. ఇతని హాస్యనటనా శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఇతను నటుడే కాకుండా వితరణశీలి కూడా. తోటి హాస్య నటులను సన్మానించేవాడు. అప్పటిలో అంజిగాడుగా పేరుపడ్డ హాస్వనటుడు బాలకృష్ణను, రేలంగి, సూర్యకాంతం, సావిత్రిలను సన్మానించాడు. కోరుకొండలో జూనియర్ కళాశాలను కట్టించాడు. ఈ కళాశాల పేరు కూడా రాజబాబు జూనియర్ కళాశాలగా పేరు పొందింది. అనేక సంస్థలకు విరాళాలు ఇచ్చాడు.
ఏడుసార్లు వరుసగా ఫిలింఫేర్ అవార్డులు పొందిన హాస్యనటుడు రాజబాబు. మూడు నంది బహుమతులు కూడా అందుకున్నాడు. 1983, ఫిబ్రవరి 14వ తేదీన స్వర్గస్తుడయ్యాడు.