రమణా రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా. 1921 అక్టోబర్ 1వ తేదీన జన్మించాడు. నెల్లూరు జిల్లా యాసతో సినిమా డైలాగ్ లు చెబుతూ తెలుగు సినిమా రంగంలో హాస్వనటుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. సంపన్న కుటుంబంలో పుట్టాడు. కాలేజిలో చదువుకునే రోజులలోనే నాటకాలు వేసేవాడు. ఇతని పూర్తిపేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి. నెల్లూరు జిల్లాలో శానిటరీ ఉద్యోగం చేసేవాడు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం వదలి మద్రాసు చేరాడు.
జానపద పాత్రాలు, పౌరాణికాలు, సాంఘిక సినిమాలలోనూ ఏ పాత్రలో నైనా ఇమిడిపోయి తనదైన శైలిలో హాస్వాన్ని పండించగల గొప్ప హాస్యనటుడు రమణా రెడ్డి. పాత్ర పోషణలో నేటి హాస్యనటులలాగా వెకిలితనం ఉండదు. అంత సహజంగా ఉంటుంది ఇతని నటన.
లవకుశలోని మునీశ్వరుడు, మాయాబజార్ లో రాక్షసుల గురువుగా, శ్రీకృష్ణసత్యలో నారదుడిగా, మిస్సమ్మలో డేవిడ్, గుండమ్మకథలో గరటయ్య, రమణారెడ్డి చేసిన పాత్రలు మరువలేనివి.
రమణా రెడ్డి ఆకారం కూడా విలక్షణంగా ఉండేది. సన్నగా పొడుగ్గా ఉండే శరీరం. రబ్బరు బొమ్మలాగా కాళ్లూ, చేతులు కదిలించడం, ఒక్కసారిగా దభాల్న పడిపోవటం ఈ నటుడికే సాధ్యపడింది. దాదాపు 200 పైగా తెలుగు సినిమాలలో నటించాడు. రేలంగి, రమణారెడ్డి ల హాస్యనటుల జంట ఆ రోజులలో పేరుపొందింది. వీరిద్దరి నటన కోసమే సినిమా చూసేవారంటే అతిశయోక్తి కాదు.
రమణా రెడ్డి మ్యాజిక్ నేర్చుకుని షూటింగ్ విరామ సమయాలలో ఇంద్రజాలం చేసేవాడు. ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చి దానివలన వచ్చిన ఆదాయాన్ని సేవాసంఘాలకు ఇచ్చేవాడు.
రమణారెడ్డి 1974 నవంబర్11న స్వర్గస్తులైనారు.