రేలంగిగా పేరుపొందిన రేలంగి వెంకట్రామయ్య 1910 ఆగస్టు 13వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రావులపాడు గ్రామంలో జన్మించాడు. తన అద్భుతమైన సహజమైన హాస్యనటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఇతని సహనటుడు హాస్యనటుడు రమణారెడ్డితో కలసి నటించిన తెలుగు సినిమాలు అన్నీ విజయవంతమైనాయి. ఆనాటి ప్రేక్షకులు వీరిద్దరి కోసమే సినిమాలు చూసేవారంటే అతిశయోక్తి కాదేమో.
నదువుకునే రోజులలోనే నాటకాలు వేసేవాడు. 1948లో వింద్యరాణితో ఇతని సినిమా ప్రస్థానం ప్రారంభమయినది. 40 సంవత్సరాలపాటు దాదాపు 300 సినిమాలలో నటించాడు. పలు సన్మానాలు బిరుదులు అందుకున్నాడు. భారతప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. మొదట్లో ఆడవేషాలు వేసి పేరు పొందాడు.
1949లో కీలుగుర్రం సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. తరువాత గుణసుందరి కథలో నటించాడు. పాతాళ భైరవి సినిమాలో అమాయకుడిగా నటించాడు. మిస్పమ్మ, అప్పుచేసి పప్పుకూడు, సువర్ణసుందరి, లవకుశ, సత్యహరిశ్చంద్ర, మయాబజార్, నర్తనశాలలో నటించాడు.
ఇతను మాయాబజార్ సినిమాలో వినవేబాల నాప్రేమగోల అనే పాటను, మిస్పమ్మలో కాణీ ధర్మం చెయ్ బాబు అనే పాటలు పాడాడు.
ఇతను చాలా ఉన్నతాశయం కలవాడు. సినిమాలో పేరు, డబ్బు సంపాదించిన తరువాత తోటి హాస్యనటులకు అవకాశాలు కల్పించటం కోసం తన సినిమాలను తగ్గించుకున్నాడు. ఇలా వచ్చిన వారిలో చలం, పద్మనాభం ఉన్నారు.
ఇతని భార్య పేరు బుచ్చియమ్మ. భార్య భర్తలిరువురూ దైవభక్తులు. ఈ దంపతులకు సత్యనారాయణ అనే వాడు ఏకైక పుత్రుడు. రేలంగి బాగా స్థితిమంతుడుగా ఉన్న సమయంలో ఇతని కొడుకుకు మంచి సంభందాలు వచ్చాయి. కానీ ఏమీ సంపాదనలేని రోజులలో తనకు పిల్లనిచ్చిన తన బావమరిది కూతురుతో వివాహాం జరిపించాడు. రేలంగి సహృదయుడు. ఎన్నో కళాశాలలకు విరాళాలిచ్చాడు.చాలామందికి వివాహాలకు సహాయం చేసాడు. రేలంగి ఇంట నిత్య అన్నదానాలు జరిగేవి. తాడేపల్లి గూడెం అంటే రేలంగికి ప్రత్యేకమైన అభిమానం. దీనికి కారణం ఆ ఊరివారు చూపిన అభిమానమే. తాడేపల్లి గూడెంలో ఇల్లు కట్టుకుని స్థిరపడి రేలంగి చిత్రమందిర్ అనే సినిమా హాలును కూడా నిర్మించాడు.
చివరి దశలో మాత్రం తీవ్రమైన నడుము నొప్పితో బాధపడ్డాడు. ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా డాక్టర్లు తేల్చారు. 1975 నవంబర్ 27 ఉదయాన తాడేపల్లి గూడెంలోని తన స్వంత ఇంట్లో కీర్తిశేషులయ్యాడు.