చిరంజీవిగా పేరుపొందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ 1955 ఆగస్టు22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించాడు. తెలుగు సీనిరంగంలో యాక్షన్ హీరోగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన భారతదేశపు ‘పద్మభూషణ్’ అవార్డును అందుకున్నాడు. చిరంజీవి భార్య తెలుగు సినిమాల ప్రఖ్యాత హాస్యనటుడు అల్లురామలింగయ్య కూతురు సురేఖ. వీరి కుమారుడు రామ్ చరణ్ కూడా తెలుగు సినిమా హీరో.
చిరంజీవి మెదటి సినిమాలు పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు. రాణికాసుల రంగమ్మ, మోసగాడు, మనవూరి పాండవులు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు ధరించాడు. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ సినిమా చిరంజీవి జీవితంలో ఓ మైలురాయిగా నిలచి ఇతన్ని హీరోగా నిలబెట్టింది. తరువాత ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, అంజి, కొండవీటి దొంగ, ముఠా మేస్త్రీ సినిమాలలో నటించి మాస్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. పున్నమినాగులో విభిన్నమైన పాత్ర ధరించాడు.
స్వయంకృషి, రుద్రవీణ, ఆపత్భాంధవుడు సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషించాడు. 1990 దశకంలో చిరంజీవి నటించిన చూడాలని ఉంది, హిట్లర్ జగదేక వీరుడు అతిలోక సుందరి శంకర్ దాదా యం.బి.బి.యస్ గొప్ప విజయాలను సాధించాయి. నాట్యపరంగా చిరంజీవి గొప్ప డాన్సర్ గా పేరుపొందాడు.ఇతని ఫైట్స్ కూడా విభిన్న తరహాలో ఉంటాయి. ఇతని సినిమాలు విదేశాలలో కూడా ప్రదర్శింపబడ్డాయి. 2002 సం.లో విడుదలైన ‘ఇంద్ర’ సినిమాలో ఇంద్రసేనా రెడ్డిగా విభిన్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.
2008 సం.లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి రాజకీయాలలో ప్రవేశించాడు కానీ ఇందులో విజయవంతం కాలేదు. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ లో చేరి విమర్శలకు గురైయ్యాడు. రాజకీయాలలో ఉండి 10 సంవత్సరాల విరామం తరువాత తన 150వ సినిమా ఖైదీ నెం.150 సినిమాతో తిరిగి సినిమాలలో ప్రవేశించాడు. తరువాత రామచరణ్ నిర్మాత గా నిర్మించిన ‘సైరా’ సినిమాలో స్వాతంత్ర్య పోరాటవీరుడు సైరా నరసింహా రెడ్డిగా నటించాడు. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఇతను హైదరాబాద్ లో ‘చిరంజీవి బ్లడ్ బాంక్’, ‘చిరంజీవి ఐ బ్యాంక్‘ సేవాసంస్థలను స్థాపించి రాష్ట్రంలో అనేక మందికి రక్తదాన, నేత్రదాన సేవలు అందించాడు.