అక్కినేని నాగార్జున తెలుగు సినిమాలలో విజయవంతమైన నటుడు, నిర్మాత మరియు టెలివిజన్ వ్యాఖ్యాత. ఇతను తెలుగు సీనీరంగంలో మరచిపోలేని స్థానం సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు. ఉన్నత విద్యావంతుడు మద్రాస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఇతను 1959 ఆగస్టు 29వ తేదీన జన్మించాడు. ఇతని భార్య అమల కూడా సీనీ నటి. వివాహం తరువాత సినిమాలలో నటించటం లేదు. ఇతని మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి వీరు విడాకులు తీసుకున్నారు.
ఇతని ఇద్దరు కుమారులు నాగచైతన్య మరియు అఖిల్ ఇద్దరూ కూడా తెలుగు సినిమా హీరోలే. నాగచైతన్య భార్య సమంత కూడా పేరుపొందిన నటీమణి.
1986సం.లో విక్రమ్ సినిమాతో నాగార్జున తెలుగు సినిమా రంగంలోకి వచ్చాడు. తరువాత మజ్నూ సినిమాలో నటించాడు. శ్రీదేవితో కలసి నటించిన ‘ఆఖరిపోరాటం’ నాగార్జునకు విజయాన్ని అందించింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’ లో ప్రేమికుడిగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. తరువాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాలో నటించి యాక్షన్ హీరోగా పేరుపొందాడు. ఈ సినిమా హిందీలో కూడా నిర్మించబడి విజయవంతమైంది.
తరువాత హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా సినిమాలలో మాస్ హీరోగా పేరుపొందాడు. ప్రముఖ వాగ్గేయకారుడు, శ్రీ వేంకశ్వర స్వామి భక్తుడైన అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘అన్నమయ్య’ సినిమాలో నటించాడు. ఈ సినిమా నాగార్జున జీవితంలో ఒక మైలురాయిగా నిలిచి గొప్ప విజయాన్ని సాధించింది. ఈ సినిమా 100 రోజులకు పైగా చాలా ధియేటర్లలో ప్రదర్శింపబడింది. ప్రేక్షకుల ప్రశంసలతోపాటు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నాడు.
2006 సం.లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామదాసు’ సినిమాలో రామదాసు పాత్రను పోషించి ప్రేక్షకుల ప్రశంసలతో పాటు రాష్ట్రప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా అవార్ఢును అందుకున్నాడు.
నేనున్నాను, సంతోషం, మన్మధుడు సినిమాలలో నటించి గ్లామర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.