కొద్దికాలంలోనే పేరు తెచ్చుకుని అకాల మరణంతో నింగికెగసిన తారలలో ఆర్తి అగర్ వాల్ ఒకరు. ఆర్తి అగర్ వాల్ తండ్రి గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్త. కానీ వీరు అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. ఆర్తి 1984 మార్చి 6వ తేదీన జన్మించారు.
ఫిలడెల్పియాలో సునీల్ షెట్టి ఒక స్టేజ్ షోలో ఆర్తిని తనతోపాటు డ్యాన్స్ చేయటానికి ఆహ్వానించాడు. దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిధి. ఆర్తి నాట్యం నచ్చిన బిగ్ బి ఆర్తిని చలనచిత్రరంగంలోకి ఆహ్వానించాడు. తరువాత ఆర్తి బొంబాయి వచ్చి నట శిక్షణాలయంలో నటిగా శిక్షణ పొందింది. తొలిసారిగా హిందీ సినిమా పాగల్ పాన్ (2001)లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
తరువాత డి.సురేష్ బాబు నిర్మించిన తెలుగు సినిమా నువ్వు నాకు నచ్చావ్ తో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగు పెట్టింది. తొలి సినిమాలోనే హీరోయిన్ గా చక్కని నటనను ప్రదర్శించి అందరి మొప్పు పొందింది. ఆనాటికి ఆగ్రనాయకులు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి మొదలగు వారితో నటించింది. యువతరం కధానాయకులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీ ఆర్, ప్రభాస్, ఉదయకిరణ్, తరుణ్ లతో నటించింది.
చిరంజీవితో ఆర్తి నటించిన ఇంద్ర ఆర్తికి నటిగా మంచి పేరు తెచ్చింది.
2005లో ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. 2007లో న్యూ జెర్సీకి చెందిన గుజరాతీ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. వివాహం తరువాత కొంతకాలం అమెరికాలో ఉండి తరిగి ఇండియా వచ్చి సినిమారంగంలో తిరిగి నటించటం మొదలు పెట్టారు కానీ సరియైన అవకాశాలు లభించలేదు.
తరువాత అనారోగ్యంతో బాధపడుతూ తిరిగి అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంది. బరువు తగ్గటానికి చేయించుకున్న లైపోసక్షన్ శస్త్రచికిత్స వికటించటంతో 2016 జూన్ 4వ తేదీన మరణించింది.