అవకాశాలు ఉన్నప్పుడు జాగ్రత్తపడకుండి చెడు అలవాట్లకు బానిసై సీనిలోకంలో అవకాశాలు కోల్పోయి, చనిపోయిన నటుడు రఘువరన్.
ఇతను 1958వ సంవత్సరం డిసెంబర్ 11 వ తేదీన కేరళలోని పాలక్కాడ్ జిల్లా, కోలెం గూడె అనే ప్రాంతంలో జన్మించాడు. ఇతని పూర్తిపేరు రాధాకృష్ణన్ వేలాయుధం రఘువరన్. ఇతను పొడగరి. ఆరడుగుల మూడు అంగుళాలు ఎత్తు ఉన్నాడు.
మొదట చిత్రరంగంలో విలన్ గా ప్రవేశించాడు. తరువాత కొన్ని సినిమాలలో హీరోగా, తరువాత క్యారెక్టర్ పాత్రలు వేసాడు. ఏ పాత్ర ధరించినా మొప్పించగల నటుడు. 1982 సం.లో తమిళ సినిమాలో నటించాడు కానీ తరువాత అవకాశాలు మాత్రం రాలేదు. సిల్క్ సిల్క్ సిల్క్ సినిమాలో నటించిన తరువాత నటుడిగా గుర్తింపు పొందాడు. అప్పటి వరకు సినిమాలలో విలన్ అంటే కండల తిగి, బలంగా, కరుకుగా ఉండే సాంప్రదాయం ఉండేది. కానీ రఘవరన్ రాకతో విలన్ స్వరూపమే మారిపోయింది. సాఫ్ట్ విలనిజంతో విలన్ స్వరూపాన్నే మార్చివేసాడు రఘువరన్.
తెలుగులో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాలో విలన్ భవానీగా నటించి తనేంటో నిరూపించుకున్నాడు.
తరువాత అంజలి సినిమాలో మానసిక ఎదుగుదల లేని పాపకు తండ్రిగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. భాషా సినిమాలో విలన్ గా రజనీ కాంత్ తో పోటీపడి నటించి తన నటనను నిరూపించుకున్నాడు.
అప్పటికి రఘువరన్ సీనీ రంగంలో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నాడు. నిర్మాతలు ఇతని కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి. కానీ సక్సెస్ తో పాటు కొత్తఅలవాట్లు మొదలయ్యాయి. ఇదివరకు అప్పడప్పుడు అన్న మందు అలవాటు ఎక్కువైంది. మందు లేనిది బయటకు రాలేని పరిస్థితి.
ఈ పరిస్థితులలో కూడా 1996 సం.లో మలయాళ నటి రోహిణి పరిచయం, తరువాత వివాహం కూడా జరిగాయి. ఈ దంపతులకు బాబు పుట్టాడు. అతని పేరు రిషివరన్. తాగుడు మాన్పించటానికి భార్య చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తరువాత 2004లో విడాకులు తీసుకున్నారు.
ఒంటరి జీవితం, తాగుడుకు తోడు మాదక ద్రవ్యాల అలవాటు కూడా చేసుకున్నాడు. మనిషి ఆకారం మారిపోయింది. చెడు అలవాట్లు మానుకుని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అదే సమయంలో ప్రకాష్ రాజ్ సీనిరంగంలోకి వచ్చాడు. ప్రకాష్ రాజ్ విలన్ గా పేరుపొందటంతో రఘువరన్ కు అవకాశాలు కనుమరుగయ్యాయి.
చెడ్డ అలవాట్లు ఇతని సీనీ అవకాశాలతో పాటు శరీర అంగాల మీద ప్రభావం చూపాయి. కాలేయం దెబ్బతింది. అనారోగంతో చెన్నై ఆసుపత్రిలో చేరి వారం రోజులుండి 2008 మార్చి 19న మరణించాడు. చెడ్ద అలవాట్లతో మంచి స్థితి నుండి పతనానికి చేరిన నటుడిగా నిలిచిపోయాడు.