header

About Lesotho ..... లెసోతో

About Lesotho ..... లెసోతో

లెసోతో... ఆఫ్రికా ఖండంలో అన్ని దిక్కులా దక్షిణ ఆఫ్రికా దేశం భూభాగం ఉండటం ఈ దేశపు ప్రత్యేకత. లెసోతో ప్రజలు ఏ దిశలో వెళ్లినా సరిహద్దులు దాటినా దక్షిణ ఆఫ్రికా భూభాగంలో అడుగుపెట్టాల్సిందే. లెసోతో చాలా చిన్న దేశం. మన దేశంలోని కేరళ రాష్ట్రం కన్నా చిన్నగా ఉంటుంది. లెసోతో సార్వభౌమాధికార దేశమే అయినా లాంఛనంగా ఓ చక్రవర్తి ఉంటారు.
లెసోతో రాజధాని మసేరు. ఈ దేశ విస్తీర్ణం 30,355 చ.కి.మీ. వీరి కరెన్సీ లోటీ. అధికార భాషలు భాషలు సెసోతో మరియు ఇంగ్లీష్. ఈ దేశం 1966లో యూకే నుంచి స్వాతంత్య్రం పొందింది. లెసోతో మొత్తం జనాభాలో ఎక్కువ మంది రాజధాని మసేరులోనే నివసిస్తుంటారు. అక్షరాస్యత శాతం 82.
ఈ దేశ జెండాలోని నీలం రంగు వర్షానికి, తెలుపు శాంతికి చిహ్నాలు. ఆకుపచ్చ సంపదకు గుర్తు. మధ్యలో ఉండే నలుపు టోపీ స్థానిక ప్రజలకు లను సూచిస్తుంది
దేశ భూభాగంలో 80శాతం సముద్రమట్టం కన్నా 1,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎక్కడ చూసినా కొండలు, లోయలే కనిపిస్తాయి. చేతికి అందినట్లుండే మేఘాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు కనిసిస్తాయి. ఇక్కడి ‘ఆఫ్రిస్కై రిసార్ట్‌’ సముద్రమట్టానికి ఏకంగా 3,050 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లేసోతో బీద దేశం. జలవనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.
గడ్డితో చేసిన ప్రత్యేకమైన టోపీలు ఇక్కడ ప్రసిద్ధి. ‘బసోతో టోపీ’లుగా పిలిచే ఇవి ఈ ప్రాంతంలోని వివిధ పర్వతాల రూపాల్లో తయారవుతాయి. ఈ దేశంలోని ‘కాట్సే డ్యామ్‌’ ఆఫ్రికా మొత్తంలో ఎత్తయిన ఆనకట్ట. ఇది దక్షిణ ఆఫ్రికా, లెసోతో దేశాలు కలిపి నిర్మించిన ప్రాజెక్టు. ఇక్కడి నుంచి నీళ్లను దక్షిణ ఆఫ్రికాకు సరఫరా చేస్తారు.
లేసోతోను ‘పర్వతాల రాజ్యం’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి భూభాగంలో మూడింట రెండో వంతు పర్వతాలే ఉంటాయి కాబట్టి. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ఇక్కడ 90 శాతం మంది క్రైస్తవులే.
ఈ దేశంలో వజ్రాల గనులు, జల వనరులు అధికం. ఉన్ని, దుస్తులు, పాదరక్షలు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ‘లెవిస్‌’ జీన్స్‌ ఇక్కడ ఎక్కువగా తయారవుతాయి. దేశ ప్రజలలో ఎక్కువ మంది వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడతారు.
ఈ దేశంలో ‘మలెట్‌సన్‌యనె’ అనే ఒకే ధార గల జలపాతం మంచి పర్యటక ప్రాంతం. ఇది 192 మీటర్ల ఎత్తు నుంచి కిందకు జాలువారుతుంది.
కంబళిని ఈ దేశ ప్రజలు సంప్రదాయ దుస్తులుగా భావిస్తారు. ఈ సంప్రదాయం మరే దేశంలోనూ కనిపించదు. రకరకాల రంగులతో పూర్తిగా ఉన్నితో వీటిని తయారు చేసుకుంటారు. చలి నుంచి రక్షణ కోసమే కాకుండా కంబళిని హోదాకు గుర్తుగా భావిస్తారు.