header

Morroco… మొరాకో

Morroco… మొరాకో

ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఉన్న చిన్న దేశం మొరాకో. అట్లాంటిక్‌ మహా సముద్రంతో దీనికి పొడవైన తీర రేఖ ఉంది. మధ్యధరా, అట్లాంటిక్‌ సముద్రాలు రెండింటితోనూ ఇది సరిహద్దుల్ని పంచుకుంది. ప్రపంచంలో ఇటువంటి దేశాలు దీనితో పాటుగా మూడే ఉన్నాయి. మొరాకో రాజధాని రాబాట్‌ అయినా ఇక్కడ అతి పెద్ద నగరం మాత్రం కాసాబ్లాంకా. ఫెజ్‌, అగదిర్‌, ఉజ్దా...లూ ఇతర ముఖ్యమైన నగరాలు.
ఈ దేశ రాజధాని రాబాట్‌ జనాభా 3,38,48,242 (2018) ఈ దేశ విస్తీర్ణం: 7,10,850 చదరపు కిలోమీటర్లు వీరి అధికారిక భాషలు అరబిక్‌, బెర్బర్‌. ఈ దేశ కరెన్సీ మొరాకన్‌ దిర్హామ్‌ ఈ దేశం ముస్లిం దేశం. మూడు కోట్లకు పైగా ఉన్న జనాభాలో 99 శాతం సున్నీ ముస్లింలే. మిగిలిన ఒక శాతం యూదులు, క్రైస్తవులు ఉన్నారు.
చరిత్ర ఆధారాల్ని బట్టి చూస్తే 2.6మిలియన్‌ సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులే లేరు. తర్వాత్తర్వాతే రోమన్‌లు, ఇతర సంచార జాతి వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మొరాకో ఆగ్నేయ భాగంలో సహారా ఎడారి ఉంటుంది. అయితే దీని సరిహద్దుల విషయంలో ఈ దేశానికి మారుటేనియా, అల్జేరియాలతో వివాదాలున్నాయి.
ఎత్తయిన పర్వతాలు, ఎడారి ప్రాంతం, సముద్ర తీరాలు, పచ్చిక మైదానాలు, దట్టమైన అడవులు... ఇలా అన్ని రకాల భూ స్వరూపాల్నీ ఇక్కడ ఉన్నాయి.
ఆఫ్రికన్‌ యూనియన్‌, అరబ్‌ లీగ్‌ల్లో సభ్యత్వం కలిగిన దేశమిది. గొర్రెమాంసంతో చేసే హరీరా సూప్‌ ఇక్కడ ప్రముఖ వంటకం. ఎక్కువగా రంజాన్‌ నెలలో దీన్ని చేసుకుంటారు. ఆహారంలో బ్రెడ్‌ను ప్రధానంగా వాడతారు. గ్రీన్‌ టీ వీరి జాతీయ పానీయం.
ఈ దేశంలో ప్రధానంగా రెండు రకాల పర్వతాలున్నాయి. ఒకటి అట్లాస్‌, రెండు రిఫి. అట్లాస్‌ పర్వతాలు ఇక్కడి భూభాగాన్ని విభజిస్తాయి. అందుకే వీటికి ‘ద బ్యాక్‌ బోన్‌ ఆఫ్‌ మొరాకో’ అనే పేరుంది. ఇవి విభజించిన ప్రాంతాల్నే మిడిల్‌ అట్లాస్‌, యాంటీ అట్లాస్‌, హై అట్లాస్‌లుగా పిలుస్తారు. హై అట్లాస్‌లో ఈ పర్వతాలపైనే చిన్న చిన్న గ్రామాలుంటాయి. బెర్బర్‌ ప్రజలు వీటిపై ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తుంటారు.
ఈ చిన్న దేశంలో రకరకాల వాతావరణాలు కనిపిస్తాయి. మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో వేసవిలోనూ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవు. చల్లగానే ఉంటుంది. అదే ఈ దేశ దక్షిణ ప్రాంతాల్లో మాత్రం 30డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరుల్లో ఇక్కడ ఎండలు మండిపోతాయి. సహారా ఎడారికి ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఎప్పుడూ దాని మీదుగా గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం పొడిగా రాత్రిళ్లు చలిగా ఉంటుంది.
మొరాకో పర్యాటక దేశం కూడా. పర్యాటకం వల్లా ఈ దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ఏటా కోటి మందికి పైగా పర్యాటకులు ఈ దేశాన్ని చూడటానికి వస్తారు. అట్లాస్‌, రిఫి పర్వతాలు అడ్వంచర్‌ టూరిజంకి ప్రసిద్ధి. వీటిపై రిసార్టులు, షాపింగ్‌ సెంటర్లు ఉన్నాయి. సహారా ఎడారి ప్రాంతాన్ని డెసర్ట్‌ టూరిజం హబ్‌గా మార్చారు.
ఆఫ్రికా దేశాల్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఈ దేశానిది ఐదో స్థానం. దేశ ఆర్థిక అభివృద్ధికి సహజ వనరులే ప్రధానం. ఇక్కడ పాస్పేట్‌ ఎక్కువగా లభిస్తుంది. పాస్పేట్‌ ను క్రిమి సంహారకాలు, ఎరువుల్లో ఎక్కువగా వాడతారు. కోబాల్ట్‌, బారైట్‌, సీసం.. తదితరాల లభ్యత ఎక్కువగా ఉంది.
నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు, ఆలివ్‌, టమాటాలు ఎక్కువగా పండుతాయి. లెదర్‌, వస్త్రాల్నీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది.
ఇక్కడ వాడే విద్యుత్‌ చాలా మటుకు బొగ్గుతోనే తయారవుతుంది. మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తుంది.